Nobel prize 2024: అర్థశాస్త్రంలో చేసిన విశేష కృషికి గానూ 2024 ఏడాదికి ముగ్గురికి నోబెల్ బహుమతి లభించింది. మెడికల్ విభాగంతో ప్రారంభమైన ఈ నోబెల్ పురస్కారాల ప్రకటన నేటితో ముగిసింది. తాజాగా సోమవారం అర్థశాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారాన్ని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. దేశాల మధ్య నెలకొన్న సంపదలో అసమానతలపై జరిపిన అనేక పరిశోధనలకు గానూ డారెన్ ఏస్‌మోగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ ఎ. రాబిన్‌సన్ ఈ నోబెల్ పురస్కారాన్ని అందుకోనున్నారు.
మెడిసిన్ విభాగంతో గత సోమవారం మొదలైన నోబెల్ పురస్కారాల ప్రకటన ఆ తర్వాత వరుసగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్ విభాగాల్లో నోబెల్ పురస్కారాలను ప్రకటించారు. ఇక శుక్రవారం రోజున నోబెల్ శాంతి బహుమతికి ఎంపికైన వారి పేరు ప్రకటించగా.. తాజాగా ఎకనామిక్స్‌లో ముగ్గురు ఆర్థికవేత్తల పేర్లను ప్రకటించారు. డారెన్ ఏస్‌మోగ్లు, సైమన్ జాన్సన్.. అమెరికా కేంబ్రిడ్జ్‌లోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందినవారు కాగా.. ఎ.రాబిన్‌సన్ షికాగో యూనివర్సిటీలో పరిశోధనలు చేస్తున్నారు.
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతిని జపాన్‌కు చెందిన నిహాన్ హిడాంకియో సంస్థ అందుకుంది. ఈ జపనీస్ సంస్థ అణ్వాయుధాలు లేని ప్రపంచాన్ని సమర్థిస్తుంది. ఇక ఈ ఏడాదికి సాహిత్యంలో దక్షిణ కొరియా రచయిత్రి హన్ కాంగ్ నోబెల్ బహుమతి దక్కించుకున్నారు. సాహిత్యంలో హన్ కాంగ్ చేసిన కృషికి ఆమెకు అవార్డు వరించింది. ఇక ఫిజిక్స్‌లో విశేష కృషి చేసినందుకు గాను ఈ ఏడాదికి జాన్ జె.హోప్‌ఫీల్డ్, జెఫ్రీ ఈ.హింటన్‌లకు నోబెల్ అవార్డు దక్కింది. ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్‌వర్క్‌లతో మెషిన్ లెర్నింగ్ ఆవిష్కరణలు చేసిందుకు గానూ వీరిద్దరికి ఈ పురస్కారం లభించింది.