Telangana UPSC Aspirants: తెలంగాణలో సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభవార్త వినిపించారు. సివిల్స్ మెయిన్స్ పరీక్షకు ఎంపికైన ప్రతి ఒక్క అభ్యర్థికి లక్ష రూపాయల నగదు సాయం అందజేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. హైదరాబాద్ అశోక్ నగర్‌లో ఏర్పాటు చేసిన సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భట్టి విక్రమార్క్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన భట్టి విక్రమార్క.. ఎన్నికల ముందు ప్రకటించినట్టుగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను కచ్చితంగా భర్తీ చేస్తామని స్పష్టం చేసారు. తెలంగాణను కొట్లాడి తెచ్చుకున్నదే నియామకాల కోసమని భట్టి గుర్తు చేశారు.
ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే 50 వేల ఖాళీలను భర్తీ చేశామని భట్టి విక్రమార్క తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగాల భర్తీ కోసం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఏ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తామన్నది యువతకు ముందే తెలియజేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే గ్రూప్-1 పరీక్షలను విజయవంతంగా నిర్వహించినట్టుగా భట్టి పేర్కొన్నారు. గ్రూప్-2 పరీక్షలు నిర్వహించబోతున్నామని వెల్లడించారు.
గత ప్రభుత్వంలో లాగా.. ప్రశ్నాపత్రాల లీకేజీ, ఇతర ఇబ్బందులు లేకుండా రాష్ట్రంలో విజయవంతంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కొనసాగిస్తున్నట్టు భట్టి విక్రమార్క తెలిపారు. మేధస్సు ఉన్నప్పటికీ నిరుపేదలు, మధ్య తరగతి వర్గాల యువత.. ఆర్థిక ఇబ్బందులతో యూపీఎస్సీ పరీక్షలను క్లియర్ చేయటంలో ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి.. వారిని ఆర్థికంగా ప్రోత్సహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్టు భట్టి చెప్పుకొచ్చారు.