తెలంగాణలో మళ్లీ కులగణన సర్వే.. ప్రత్యేకంగా వారి కోసం మాత్రమే.. ఎప్పటినుంచంటే..

కాంగ్రెస్‌ ప్రభుత్వం అసెంబ్లీలో సమగ్ర కులగణన సర్వే రిపోర్ట్‌పై చేసిన ప్రకటనపై అటు ప్రతిపక్షాలు.. ఇటు బీసీ సంఘాలు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నాయి. దీంతోపాటు.. మాటల యుద్ధం కూడా కొనసాగుతోంది.. కులగణన సర్వే రిపోర్ట్‌ చరిత్రాత్మకమని ఈ సర్వే ద్వారా దేశానికి తెలంగాణ రోల్ మోడల్ అవుతుందని ఆశించిన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సర్వేలో బీసీల జనాభా గణనీయంగా తగ్గడంపై బీసీ సంఘాల నుంచి అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ తరుణంలో రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.. తెలంగాణలో మళ్లీ కులగణన సర్వే చేపట్టనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. 3.1 శాతం మంది కుల గణన సర్వేలో పాల్గొనలేదని.. వారి కోసం మళ్లీ సర్వే చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి 16 నుండి 28 వరకు కులగణన రీ సర్వే చేపట్టనున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. సర్వేలో పాల్గొనని వాళ్లు ఆన్‌లైన్, టోల్‌ ఫ్రీ నంబర్ లేదా మండల కార్యాలయానికి వెళ్లి తమ వివరాలు ఇవ్వొచ్చని భట్టి తెలిపారు.

సచివాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో కులగణన సర్వే లెక్కలు వెల్లడించాం.. దీనిపై సభలో చర్చ కూడా జరిగిందని భట్టి విక్రమార్క తెలిపారు. ఎంతో సహేతుకంగా సర్వే నిర్వహించి గణాంకాలు వెల్లడించామన్నారు. 3.1 శాతం ఇళ్లలో సర్వే నిర్వహించలేదని సభలోనే చెప్పామని.. కొందరు ఉద్దేశపూర్వకంగానే వివరాలు వెల్లడించలేదని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్ సహా పలువురు నేతలు సర్వేకు సహకరించలేదన్నారు. ఇప్పుడు మళ్లీ వారే రీసర్వే చేయాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. మిగిలిపోయిన 3.1 శాతం మంది కోసం.. ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు అవకాశం ఇస్తామని.. మూడు మార్గాల ద్వారా సర్వేకు వివరాలు ఇవ్వొచ్చని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌పై వచ్చేనెల కేబినెట్‌లో బిల్లు పెట్టబోతున్నట్టు భట్టి విక్రమార్క తెలిపారు. అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందాక దీన్ని కేంద్రానికి పంపుతామని.. పార్లమెంట్‌లో ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. ఇందుకోసం ప్రధాని, ఇతర రాజకీయ పార్టీలను కలుస్తామన్నారు.

About Kadam

Check Also

25 ఏళ్ల వైభవాన్ని చాటిచెప్పేలా బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు అట్టహాసంగా ఏర్పాట్లు!

25 ఏళ్ల వైభవాన్ని చాటిచెప్పేలా అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తోంది గులాబీ పార్టీ. బాహుబలి వేదిక.. ఉద్యమ ప్రస్థానాన్ని గుర్తు చేసేలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *