అందుకే వరదబాధితుల వద్దకు రావట్లేదు.. పవన్ క్లారిటీ, బాధితులకు రూ.కోటి విరాళం

Deputy CM: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. మరోసారి తన దాతృత్వ గుణాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వరదలతో అల్లాడుతున్న వారికి అండగా నిలిచేందుకు తన వంతుగా రూ.కోటి విరాళం ప్రకటించారు. ఇక గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న బాధితులకు ధైర్యం చెప్పేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. శనివారం ఉదయం నుంచి ఇప్పటివరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ వారికి అండగా నిలుస్తున్నారు. ఇక ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా పలు ప్రాంతాల్లో పర్యటించి.. వరద బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు వరద బాధితులను పరామర్శించడం లేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విమర్శలకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అధికార యంత్రాంగం, రెస్క్యూ సిబ్బంది మొత్తం క్షేత్రస్థాయిలో నిర్విరామంగా సేవలు అందిస్తున్నారు. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అలుపు లేకుండా పర్యటిస్తూ బాధితులకు సహాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాను కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్లి.. వరద బాధితులను పరామర్శించడానికి వెళ్తే.. సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. తాను వెళ్తే జనం, అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు అంతా తన చుట్టే ఉంటారని.. అప్పుడు బాధితులకు సహాయక చర్యలు అందడంలో ఆలస్యం అవుతుందని పేర్కొన్నారు. వరద బాధితులను కలవడంలో తనకు ఎలాంటి సమస్య లేదని చెప్పిన ఉప ముఖ్యమంత్రి.. అలా చేస్తే వరద బాధితులకు సహాయం కాస్తా సమస్యగా మారుతుందని చెప్పారు.

ఈ క్రమంలోనే తన వంతుగా రాష్ట్రంలో వరద బాధితులకు సొంతంగా కోటి రూపాయలు ఇవ్వనున్నట్లు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ వెల్లడించారు. బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ విరాళాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు బుధవారం సీఎం చంద్రబాబును కలిసి చెక్కు అందజేయనున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో వరద పరిస్థితిని విపత్తు నిర్వహణ కమిషన్‌ కార్యాలయం నుంచి పరిశీలించారు. ఈ సమీక్షలో రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణశాఖ మంత్రి వంగలపూడి అనిత, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సిసోడియా, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.

ప్రస్తుతం వరద తగ్గుతోందని.. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వం తీరు వల్లే ప్రస్తుతం ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయని డిప్యూటీ సీఎం మండిపడ్డారు. ప్రస్తుతం పెద్ద ప్రమాదం తప్పిందని.. సహాయం కోసం ప్రజలు 112, 1070, 18004250101 నంబర్లకు ఫోన్‌ చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రకృతి విపత్తు సమయంలో ఒకరిపై మరొకరు నిందలు వేసుకోవడం కంటే ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు రావాలని హితవు పలికారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఏం చేయాలనేది కేబినెట్ సమావేశంలో చర్చిస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రతి నగరానికి మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేస్తామని.. వరద నిర్వహణ కోసం బృహత్తు ప్రణాళిక తయారు చేస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు.

About amaravatinews

Check Also

సంవత్సరం అయినా సమస్య పరిష్కరించలే.. కట్ చేస్తే.. కేక్ పట్టుకొని..

సంవత్సరం అయినా సమస్య పరిష్కరించలేదని అధికారుల తీరుకు నిరసనగా.. అమలాపురం కలెక్టరేట్లో బాధితుడు కేక్ కట్ చేసేందుకు వచ్చాడు. పిర్యాదు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *