కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని ఆలయానికి ఓ భక్తుడు భారీ కానుకను అందజేశారు. సత్యనారాయణస్వామివారి దేవేరి అనంతలక్ష్మి అమ్మవారికి వజ్ర కిరీటాన్ని అందజేశారు. పెద్దాపురం శ్రీలలితా ఎంటర్‌ప్రైజెస్ ఇండస్ట్రీస్ ఎండీ మట్టే సత్యప్రసాద్, సూర్యకమల దంపతులు దాదాపు రూ.కోటిన్నరతో (కిలో బంగారం, 130 క్యారెట్ల వజ్రాలతో) ఈ కిరీటాన్ని అమ్మవారికి తయారు చేయించారు. అలాగే స్వామి, అమ్మవార్లకు వజ్రాలు పొదిగిన బంగారు కర్ణాభరణాలను కూడా తయారు చేయించి అందజేశారు. ఆగస్టు 6న సత్యదేవుడి జన్మనక్షత్రం మఖ పర్వదినం రోజున అమ్మవారికి ఈ కిరీటాన్ని అలంకరిస్తారు. అమ్మవారి శిరస్సుకు కిరీటాన్ని, స్వామి, అమ్మవార్లకు కర్ణాభరణాలను ఆలయ అర్చకులు అలంకరిస్తారు.
రెండేళ్ల కిందట సత్యదేవునికి వజ్రకిరీటాన్ని దాత సత్యప్రసాద్ తయారుచేయించిన సంగతి తెలిసిందే. అప్పట్లో 682 గ్రాముల బంగారం, 3,764 వజ్రాలు, కెంపు, పచ్చలతో కిరీటాన్ని తయారు చేయించారు. సత్యప్రసాద్ దేవస్థానంలో రూ.కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేయించిన సంగతి తెలిసిందే. ప్రసాదం తయారీ భవనాన్ని రూ. 5 కోట్లతో నిర్మించడానికి సాయం అందించారు. అన్నవరం సత్యదేవుడి సహస్ర దీపాలంకరణ సేవ కోసం హారతులను ఆయన తయారు చేయించి అందజేశారు. సుమారు రూ.70 లక్షలతో ఆలయ ప్రధాన ఆలయం ముందు గోడలకు బంగారు తాపడం చేయించారు. సీతారాముల ఆలయానికి ధ్వజస్తంభం, ఇత్తడి తాపడం చేయించడంతో పాటుగా నిత్యకల్యాణ మండపానికి ఏసీ సౌకర్యం పెట్టించారు. ఆలయం కోసం ఎంతో చేశారు.