తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. శ్రీవారి దర్శనం తర్వాత ఆ వడ్డీకాసులవాడికి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. మరికొంత మంది తమకు వీలైనంత మేరకు ధన, వాహన, వస్తు రూపేణా శ్రీవారి ఆలయ బాధ్యతలు చూసే టీటీడీ ట్రస్టుకు విరాళంగా అందిస్తుంటారు. ఇంకొంతమంది తిరుమల ఆలయానికి నగలు, వస్తువులు బహుమానంగా అందిస్తుంటారు. ఈ క్రమంలోనే తిరుమల శ్రీవారి ఆలయానికి కొప్పెర హుండీ బహుమతిగా అందింది. కొప్పెరవారిపల్లికి చెందిన కామినేని శ్రీనివాసులు, అతని కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారి ఆలయానికి కుప్పెర హుండీని బహుకరించారు. శ్రీవారి ఆలయం ముందు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి కొప్పెర హుండీని అందించారు.
అయితే అసలేంటీ కొప్పర హుండీ అంటే.. మూతి వెడల్పుగా ఉండే లోహపు పాత్రను కొప్పెర అంటారు. తిరుమల ఆలయంలో ఈ కొప్పెర హుండీలోనే భక్తులు తమ మొక్కులు, కానుకలు సమర్పిస్తూ ఉంటారు. తెల్లని వస్త్రంలో ఈ కొప్పెరలను ఉంచి హుండీగా వినియోగిస్తుంటారు. శ్రీవారి దర్శనం తర్వాత విమాన ప్రదక్షిణం చేసి వచ్చిన భక్తులు.. ఈ హుండీలో కానుకలు సమర్పించుకుంటారు. అయితే తిరుమలకు వచ్చే భక్తుల రద్దీ ఎక్కువ కావటంతో.. ఈ హుండీ త్వరగా నిండిపోతూ ఉంటుంది. అలాంటి సమయంలో సిబ్బంది కర్రల ద్వారా ఈ హుండీని లెక్కింపు కోసం తీసుకెళ్తారు. మరో హుండీని ఏర్పాటు చేస్తుంటారు. అయితే ఇలా హుండీ దగ్గర పనిచేసే సిబ్బందిని కొప్పెరవాళ్లు అని.. వారు నివసించే ఊరిని కొప్పెరవారిపల్లి అంటారని పెద్దలు చెప్తుంటారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ
మరోవైపు పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజైన శుక్రవారం పవిత్ర సమర్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఉదయం యాగశాలలో హోమాలు నిర్వహించారు. ఆ తర్వాత సంపంగి ప్రాకారంలో స్నపన తిరుమంజనం కార్యక్రమం నిర్వహించారు. స్నపన తిరుమంజనంలో భాగంగా ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు వంటి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు.
ఆ తర్వాత మంగళవాయిద్యాల నడుమ శ్రీవారి మూలవర్లకు, ఉత్సవ మూర్తులకు, జయవిజయులకు, గరుడాళ్వారుకు, వరదరాజస్వామికి, వకుళమాత అమ్మవారికి, విష్వక్సేనుడికి, యోగనరసింహస్వామికి, పవిత్రమాలలు సమర్పించారు. అనంతరం మలయప్పస్వామి సాయంత్రం మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. మరోవైపు పవిత్రోత్సవాల్లో భాగంగా శ్రీవారి ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది.