విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ఓ సామాన్య భక్తుడు భారీ కానుకను సమర్పించాడు. కొబ్బరి బోండాల వ్యాపారం చేసే అతడు కొన్నేళ్లుగా రూపాయి రూపాయి కూడబెడుతూ.. పోగు చేసిన సొమ్ముతో 203 గ్రాముల బంగారం కొని అమ్మవారికి మంగళసూత్రం తయారుచేయించి తీసుకొచ్చాడు. ఆ హారం విలువ రూ. 16.50 లక్షల విలువ ఉంటుందని ఆలయ సిబ్బంది తెలిపారు. అమ్మవారి భక్తుడైన అంకులయ్యా.. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల వేల తన కానుకను సమర్పించి మురిసిపోయాడు. తన కుటుంబంతో కలిసి శనివారం (అక్టోబర్ 5) దుర్గగుడికి వచ్చి మంగళసూత్రాలను ఆలయ ఈవోకి అందజేశారు.
ప్రకాశం జిల్లా కొండెపి మండల కేంద్రానికి చెందిన కళ్లకుంట అంకులయ్య, రాజేశ్వరి దంపతులు కొబ్బరిబోండాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. తమ సంపాదనలో రోజూ కొంత దాచుకున్నారు. అలా పోగైన సొమ్ముతూ అప్పుడప్పుడూ కొంత బంగారాన్ని తీసుకున్నారు. అలా సమీకరించిన 203 గ్రాముల బంగారంతో అమ్మవారికి మంగళసూత్రాలు చేయించారు. ఆ మంగళసూత్రం చేయడానికి నెల రోజుల సమయం పట్టిందని అంకులయ్య తెలిపారు.
‘ఇది (మంగళసూత్రం) అమ్మవారి మెడలో వేస్తే చాలు. నా జన్మ ధన్యమైపోతుంది. ఇక అంతకంటే ఏమీ వద్దు. అమ్మవారి మెడలో వేశాక నా కళ్లతో చూడాలని ఉంది. అంతకంటే ఆనందం నాకు ఏం కావాలి సార్? ఉదయం నుంచి పచ్చి మంచినీళ్లు కూడా తాగలేదు సార్. అమ్మవారి మెడలో ఈ ఆభరణాన్ని వేశాక, నా కళ్లతో చూసిన తర్వాత అప్పుడు మంచినీళ్లు తాగుతా..’ అని అంకులయ్య అన్నారు.
Amaravati News Navyandhra First Digital News Portal