మహారాష్ట్ర సహా నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ శుక్రవారం మధ్యాహ్నం షెడ్యూల్ విడుదల చేయనుంది. ఈ మేరకు మధ్యాహ్నం 3 గంటలకు మీడియాను సమావేశానికి ఆహ్వానించింది. మహారాష్ట్ర, హరియాణా, ఝార్ఖండ్‌తో పాటు జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలను నిర్వహించనున్నారు. సెప్టెంబరు 30లోగా జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు గడువు విధించింది. ఈ నేపథ్యంలో మిగతా మూడు రాష్ట్రాలతో పాటు కశ్మీర్‌లోనూ ఎన్నికలకు ఈసీ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.
ఇక, హరియాణా అసెంబ్లీకి నవంబరు 3తోనూ.. మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబరు 26తోనూ గడువు ముగియనుండగా.. ఝార్ఖండ్ అసెంబ్లీ గడువు జనవరి 2025తో ముగుస్తాయి. ఇటీవల కశ్మీర్‌లో పర్యటించిన ఎన్నికల కమిషన్.. అక్కడ పరిస్థితులను సమీక్షించింది. అలాగే, హరియాణాలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లును పరిశీలించింది. మహారాష్ట్రలో ఈసీ పర్యటన కొనసాగుతోంది. జమ్మూ కశ్మీర్‌కు షెడ్యూల్ వెల్లడిస్తే.. అక్కడ పదేళ్ల తర్వాత ఎన్నికల జరగనున్నాయి. చివరిసారిగా 2014లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.
2019లో జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ను కేంద్రం రద్దు చేసింది.. జమ్మూ కశ్మీర్, లడఖ్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. అయితే, నియోజకవర్గాల పునర్విభజన సహా పలు కారణాలతో శాసనసభ ఎన్నికలను నిర్వహించలేదు. 2022లో నియోజకవర్గాల పునర్విభజన పూర్తిచేసింది. ఇటీవల కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అక్కడ పర్యటించి.. ఎన్నికల సన్నద్ధత ఏర్నాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా ఎన్నికల నిర్వహణకు కట్టుబడి ఉన్నామని ఉద్ఘాటించారు.
‘‘జమ్మూ కశ్మీర్‌లో వీలైనంత త్వరగా ఎన్నికలను నిర్వహించడానికి మేము కట్టుబడి ఉన్నాం.. ఎన్నికలను అడ్డుకోడానికి అంతర్గత లేదా బాహ్య శక్తులను అనుమతించం.. వీలైనంత త్వరగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని జమ్మూ కశ్మీర్‌లోని అన్ని రాజకీయ పార్టీలు గట్టిగానే డిమాండ్ చేస్తున్నాయి’ అని రాజీవ్ కుమార్ అన్నారు. ఈ నేపథ్యంలో ఈసీ మీడియా సమావేశానికి ఆహ్వానించడంతో జమ్మూ కశ్మీర్ ఎన్నికలకు తేదీలను వెల్లడిస్తుందనే ఊహగానాలు మొదలయ్యాయి.