Ayyappa: కేరళలోని పథనంతిట్ట జిల్లాలో కొలువైన శబరిమల అయ్యప్ప స్వామి దర్శనాలు ప్రారంభం అయ్యాయి. 2 నెలల పాటు సాగే మండల మకరవిళక్కు పూజల కోసం నవంబర్ 15 (శుక్రవారం) సాయంత్రం 4 గంటలకు ఆలయ ద్వారాలను శబరిమల అర్చకులు తెరిచారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఉదయం నుంచే మండల మకరవిళక్కు పూజల కోసం.. అయ్యప్ప భక్తులు శబరిగిరులకు పోటెత్తారు. ఇక గతేడాది అయ్యప్ప దర్శనాల సందర్భంగా నెలకొన్న భక్తుల రద్దీ నేపథ్యంలో.. ఈసారి కేరళ ప్రభుత్వం, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.
ఇక శబరిమల అయ్యప్ప దర్శనాలకు వచ్చే భక్తుల కోసం భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మొట్టమొదటిసారిగా కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక వాతావరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ఐఎండీ గురువారం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఉత్తర భారతదేశంలో ఏటా నిర్వహించే అమర్‌నాథ్, చార్‌ధామ్ యాత్రల్లో మాదిరిగానే శబరిమల యాత్రపై వాతావరణ వ్యవస్థను తీసుకొస్తున్నట్టు తెలిపింది. సన్నిధానం, పంబా, నీళక్కల్ ప్రాంతాల్లో మూడు చోట్ల వర్ష సూచికలను ఏర్పాటు చేస్తున్నామని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
ఈ స్థానిక వాతావరణ వ్యవస్థ ద్వారా.. భక్తులు ఎప్పటికప్పుడు శబరిమలలో వాతావరణ పరిస్థితులను తెలుసుకోవచ్చని తెలిపింది. శబరిమలకు సంబంధించి 3 రోజుల వాతావరణ సమాచారం భక్తులకు అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే శబరిమలకు వచ్చిన అయ్యప్ప భక్తుల యాత్ర మరింత సులభం అవుతుందని ఐఎండీ పేర్కొంది. ఇక త్వరలోనే శబరిమలలో శాశ్వత వాతావరణ పర్యవేక్షణ వ్యవస్థను తీసుకొస్తున్నట్టు స్పష్టం చేసింది.