ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీ, జనసేన, బీజేపీల్లోకి చేరికలు జరుగుతున్నాయి. ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి జంపింగ్స్ నడుస్తున్నాయి. అనకాపల్లి జిల్లాలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది.. వైఎస్సార్‌సీపీ నుంచి జనసేన పార్టీలో చేరిన నేతలు.. ఐదు రోజులకే తిరిగి వైఎస్సార్‌సీపీలో చేరారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలంల జంపపాలెం ఎంపీటీసీ శిలపరశెట్టి ఉమ యలమంచిలి మండల పరిషత్ వైస్ ఎంపీపీగా ఉన్నారు. ఈ నెల 8న ఉమ మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్, పార్టీ నేతల సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఉమతో పాటూ ఆమె భర్త జనసేన పార్టీ కండువాలు కప్పుకున్నారు.
వైఎస్సార్‌సీపీ నుంచి జనసేన పార్టీలో చేరి ఐదు రోజులు కాగా.. ఉమ తిరిగి వైఎస్సార్‌సీపీలోకి వచ్చేశారు. తాడేపల్లిలో పార్టీ అధినేత వైఎస్ జగన్.. యలమంచిలి నియోజకవర్గ స్థానిక ప్రజాప్రతినిధుల సమావేశం అయ్యారు. ఉమ ఆమె భర్త గణేష్‌తో కలిసి ఈ సమావేశానికి హాజరయ్యారు.. ఈ సమావేశంలో భాగంగా మాజీ సీఎం జగన్‌ను కలిశారు. జనసేన పార్టీలో ఐదు రోజులు కూడా ఉండలేదు.. తిరిగి వైఎస్సార్‌సీపీలోకి వచ్చేశారు.
తమకు మాయమాటలు చెప్పి బలవంతంగా జనసేన పార్టీ కండువా వేశారని.. తనకు రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతానని ఉమ అన్నారు. ఎంపీటీసీల సమావేశం ఉందని చెబితేనే తాము వెళ్లామన్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌తోనే తమ ప్రయాణం ఉంటుందన్నారు. ఈ పరిణామం నియోజకవర్గంలో ఆసక్తికరంగా మారింది. కేవలం ఐదు రోజుల్లోనే జనసేన పార్టీని వీడటం చర్చనీయాంశమైంది. అయితే మరో వాదన కూడా వినిపిస్తోంది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఉమను జనసేన పార్టీలో చేర్చుకున్నారు. అయతే కూటమి ఈ ఎన్నికలకు దూరం కావడంతో ఉమ తిరిగి వైఎస్సార్‌సీపీలో చేరినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. ఐదు రోజుల వ్యవధిలో జరిగిన ఈ పొలిటికల్ డ్రామా యలమంచిలి నియోజకవర్గం రాజకీయాల్లో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.