విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం మధ్యాహ్నం మధ్యాహ్నం 1.45 గంటలకు 3 సెట్ల పత్రాలను పార్టీ నేతలతో కలిసి రిటర్నింగ్ అధికారి కె మయూర్ అశోక్‌కు అందజేశారు. నామినేషన్ సమయంలో ఉత్తరాంధ్ర వైఎస్సార్‌సీపీ పరిశీలకుడు వైవీ సుబ్బారెడ్డి కలెక్టరేట్ లోపలికి వెళ్లకుండా బయటే ఉన్నారు. బొత్స సత్యనారాయణ వెంట మాజీ మంత్రులు బూడి ముత్యాలనాయుడు, గుడివాడ అమర్‌నాథ్, కురసాల కన్నబాబు, అరకు ఎంపీ తనూజారాణి, విశాఖ మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలు ఉన్నారు.
బొత్స సత్యనారాయణ తన ఆస్తులు, అప్పులు, విద్యార్హతలు, నేరచరిత్ర తదితర అంశాలపై.. నామినేషన్ పత్రాల దాఖలు సమయంలో అఫిడవిట్ రూపంలో సమర్పించారు. 2024 మే లో జరిగిన సార్వత్రిక ఎన్నికల అఫిడవిట్‌తో పోల్చితే ఆస్తులు రూ.73.14 లక్షలు, అప్పులు రూ.95 లక్షల మేర పెరిగాయి. 2024 మే నెలలో రూ.73.14 లక్షల విలువ చేసే రెండు ఆస్తులు కొనుగోలు చేసినట్లు తెలిపారు. తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని, బీఏ చదివినట్లు పేర్కొన్నారు. తన పేరిట రూ.11.42 కోట్ల ఆస్తి.. తన సతీమణి పేరిట స్థిరాస్తి రూ.4.46 కోట్లు, చరాస్తి రూ.3.92 కోట్లు ఉందన్నారు.
మరోవైపు విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండాలని కూటమి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విజయం సాధించేందుకు అవసరమైన బలం లేకపోవడంతో.. పోటీ చేయకపోవడమే మంచిదని మెజారిటీ నేతలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మొత్తం 838 మంది ఓటర్లు (స్థానిక సంస్థల ప్రజా ప్రతినిథులు) ఉన్నారు. ఈ ఎన్నికల్లో గెలవాలంటే 420 ఓట్లు రావాలి.. కూటమికి 300 ఓట్ల బలం ఉంది. మిగిలిన 120 ఓట్లు సమీకరించుకోవాల్సి ఉంటుంది.. అయితే అంత ప్రయాస పడి గెలవాల్సిన అవసరం లేదని కొందరు నేతలు అభిప్రాయపడ్డారు.