ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్సార్‌సీపీ రూట్ మార్చింది. పార్టీలో అవసరమైన మార్పులు, చేర్పులు చేపట్టారు.. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలకు కొత్త అధ్యక్షుల్ని నియమించారు. అంతేకాదు పార్టీ అనుబంధ విభాగాలకు కూడా అధ్యక్షుల్ని నియమించారు. అంతేకాదు ఆయా జిల్లాల్లో నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లను కూడా మారుస్తున్నారు. తాజాగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో ఇంఛార్జ్‌లను మార్చేశారు. మాజీ మంత్రి విడదల రజినికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది అధిష్టానం.
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తాడికొండ, చిలకలూరిపేట నియోజకవర్గాలకు వైఎస్సార్‌సీపీ కొత్త సమన్వయకర్తలను నియమించింది. తాడికొండలో మాజీ మంత్రి సుచరితను తప్పించి బాలవజ్రబాబును.. చిలకలూరిపేటలో కావటి మనోహర్‌నాయుడు స్థానంలో మాజీ మంత్రి విడదల రజినిని పంపించారు.ఉమ్మడి జిల్లాలో వైఎస్సార్‌సీపీ నేతలు కొందరు పార్టీని వీడారు. కొన్ని నియోజకవర్గాల్లో సమన్వయకర్తలు అందుబాటులో ఉండటం లేదంటున్నారు. కొందరు నేతలు సమన్వయకర్తలుగా కొనసాగేందుకు ఆసక్తిచూపించకపోవడంతో అధిష్టానం మార్పులు, చేర్పులు చేస్తోంది.
మొన్నటి వరకు చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న కావటి మనోహర్‌నాయుడిని తప్పించి మాజీ మంత్రి రజినిని అక్కడికి పంపించారు. ఇటీవల ఆమె వైఎస్సార్‌సీపీని వీడతారనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి తప్పించి చిలకలూరిపేటకు పంపించారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎమ్మెల్సీగా ఉన్న మర్రి రాజశేఖర్‌తో విభేదాలు, వివాదాల ఉన్నాయి. ఈ క్రమంలో రజనిని ఏపీ ఎన్నికల సమయంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి పంపించారు. ఈ మార్పులపై రెండు రోజుల కిందట మర్రి రాజశేఖర్, సుచరితను జగన్ పిలిపించి మాట్లాడినట్లు తెలుస్తోంది.