ప్రకాశం జిల్లా ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుటుంబంలో విషాదం జరిగింది. ఆయన సోదరుడు, మాజీ ఎంపీ సుబ్బరామిరెడ్డి సతీమణి, మాజీ ఎంపీ మాగుంట పార్వతమ్మ కన్నుమూశారు. ఆమె అనారోగ్యంతో చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. పార్వతమ్మ మరణం మాగుంట కుటుంబంలో విషాదం నింపిందన్నారు ఎంపీ శ్రీనివాసులు రెడ్డి. పార్మతమ్మ తనకు తల్లితో సమామని.. ఆమె మరణం తీరని లోటన్నారు. ఏప్రిల్ నెలలో మాగుంట సుబ్బరామిరెడ్డి, పార్వతమ్మల కుమారుడు మాగుంట విజయ్ రెడ్డి ప్రాణాలు కోల్పోయారు. ఐదు నెలల్లోనే పార్వతమ్మ మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. పార్వతమ్మ మరణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని తెలిపారు.
కుమారుడి మరణం తర్వాత మాగుంట పార్వతమ్మ ఆరోగ్యం దెబ్బతింది.. ఆమెను ఇటీవల చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ పార్మతమ్మకు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు.. మంగళవాంర ఆరోగ్య పరిస్థితి విషమించిందని వైద్యులు చెప్పారు. వెంటనే ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డితోపాటు కుటుంబ సభ్యులంతా చెన్నైకు చేరుకున్నారు.. ఆమె పరిస్థితి విషమంగానే ఉందని ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి మంగళవారం తెలిపారు. అయితే ఇవాళ ఉదయం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. ఆమె తుదిశ్వాస విడిచారు.
మాగుంట సుబ్బిరామిరెడ్డి కుటుంబానికి ప్రకాశం, నెల్లూరు జిల్లాల రాజకీయాల్లో మంచి పేరు ఉంది. వాస్తవానికి మాగుంట సుబ్బరామిరెడ్డిది నెల్లూరు జిల్లా.. కానీ ఆయన ప్రకాశం జిల్లా రాజకీయాల్లోకి వచ్చారు.. ఆయన 1991లో కాంగ్రెస్ పార్టీ నుంచి తొలిసారి ఒంగోలు ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. ఆయన మరణంతో భార్య పార్వతమ్మ 1996లో ఒంగోలు ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీచేసి గెలిచారు. ఆ తర్వాత 1998లో మాగుంట సుబ్బరామిరెడ్డి సోదరుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు.. ఆయన కాంగ్రెస్ తరఫున ఒంగోలు ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. మాగుంట శ్రీనివాసులురెడ్డి 1999లో మరోసారి ఒంగోలు ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేయగా.. టీడీపీ అభ్యర్థి కరణం బలరాం చేతిలో ఓడారు.