UP Fire Accident: ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయ్ మెడికల్ కాలేజీలో చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదానికి ఓ నర్స్ నిర్లక్ష్యమే కారణమని ప్రత్యక్ష సాక్షి ఒకరు పేర్కొనడం సంచలనం రేపుతోంది. మెడికల్ కాలేజీలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్-ఐసీయూలో మంటలు వ్యాపించి 10 మంది శిశువులు సజీవదహనం అయిన ఘటన ప్రస్తుతం దేశం మొత్తం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ అగ్ని ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అని అధికారులు, అంతా ప్రాథమికంగా భావించగా.. తాజాగా ఈ విషయం వెలుగులోకి రావడం పెను దుమారం రేపుతోంది. ఓ నర్సు ఐసీయూలో అగ్గిపుల్ల వెలిగించడంతోనే ఇంతటి ఘోర ప్రమాదం చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షి చేసిన ఆరోపణలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ప్రమాదం జరిగిన ఆస్పత్రిలోని ఐసీయూలో హమీర్‌పూర్‌కు చెందిన భగవాన్ దాస్ అనే వ్యక్తి కుమారుడు చికిత్స పొందుతున్నాడు. అయితే అగ్ని ప్రమాద ఘటన జరిగిన సమయంలో తాను అందులోనే ఉన్నట్లు భగవాన్ దాస్ చెప్పాడు. అయితే ఐసీయూలో ఒక నర్సు.. ఆక్సిజన్ సిలిండర్‌కు ఉన్న పైప్‌ను బిగిస్తుండగా.. అక్కడే పక్కన ఉన్న మరో నర్సు అగ్గిపుల్లను వెలిగించిందని తెలిపాడు. దానివల్లే ప్రమాదం జరిగిందని భగవాన్ దాస్ చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఐసీయూ మొత్తం ఆక్సిజన్‌తో నిండిఉండటం వల్ల.. చూస్తుండగానే క్షణాల్లోనే మంటలు అంతా వ్యాపించినట్లు పేర్కొన్నాడు. తాను వెంటనే అలర్ట్ అయి.. తన మెడకు ఉన్న బట్టను తీసి నలుగురు పిల్లలను అందులో పట్టుకుని బయటికి పరిగెత్తినట్లు చెప్పాడు. అక్కడే ఉన్న మరికొందరికి విషయం చెప్పి.. ఇంకొంతమంది చిన్నారులను కాపాడినట్లు వివరించాడు.