పవన్ మన్యం పర్యటనలో అంతా తానై వ్యవహరించిన IPS.. ఆ తర్వాత సంచలన నిజం

పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ నెల 20న జరిగిన ఏపి డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో భద్రతా లోపం చోటుచేసుకుంది. ఏజెన్సీ ప్రాంతం కావడంతో పవన్ కళ్యాణ్ పర్యటనకు సుమారు 1500 మంది సిబ్బందితో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఆ టూర్‌కి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, జిల్లా కలెక్టర్ శ్యామ్, జిల్లా ఎస్‌పి మాధవ రెడ్డి సైతం హాజరయ్యారు. అయితే..

డిసెంబర్ 20న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మన్యం జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. పవన్ రక్షణ కోసం జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో సాగిన భద్రతా వలయంలోకి పోలీసుల ముసుగులో ఒక నకిలీ ఐపిఎస్ ప్రవేశించి హల్‌చల్ చేశాడు. ఐపీఎస్ యూనిఫామ్‌లో ఉన్న ఆ అధికారి ఎవరో ఎవరికీ అర్థం కాలేదు. కానీ ఐపిఎస్ యూనిఫామ్‌లో ఉండటంతో డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలు నకిలీ ఐపిఎస్‌కు పోలీస్ మాన్యువల్ ప్రకారం మర్యాదలు కూడా చేశారు. ఆ నకిలీ ఐపిఎస్ కొంతసేపు పవన్ టూర్‌లో డ్యూటీ కూడా చేశాడు. ట్రాఫిక్ కంట్రోల్ కోసం క్రింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఎస్సై, సిఐలకు భాద్యతలు అప్పగించాడు. ఈ నకిలీ ఐపిఎస్ చేసిన హడావుడికి అంతా హడలెత్తిపోయారు. కొందరు ఎస్సైలు, సీఐలు ఈయనతో ఫోటోలు కూడా దిగారు. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ టూర్ ఏజెన్సీ ప్రాంతంలో ప్రశాంతంగా ముగియటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఈ నకిలీ ఐపిఎస్ తమ గ్రామానికి చెందిన పలు సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్స్‌లో పవన్ కళ్యాణ్ టూర్‌లో దిగిన తన ఫోటోలను షేర్ చేశాడు. దీంతో ఆ గ్రామస్తులు అతని ఫోటోలను మరిన్ని గ్రూప్స్‌లో షేర్ చేశారు. అలా తిరిగి తిరిగి చివరకు ఆ ఫోటోలు పోలీసుల వద్దకు చేరుకున్నాయి. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి ఎంక్వయిరీ చేయగా అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి

పవన్  కల్యాణ్ టూర్‌లో ఐపిఎస్ యూనిఫారమ్‌లో ఉన్న వ్యక్తి నకిలీ ఐపిఎస్ అని తేల్చారు. అతను బలివాడ సూర్య ప్రకాష్ అని, విజయనగరం మండలం ముడిదాంలో నివాసముంటున్నట్లు నిర్ధారించారు. దత్తిరాజేరు మండలం గడసాంకు చెందిన సూర్య ప్రకాష్ తన సొంత గ్రామంలో ఉన్న భూతగాధాల నేపథ్యంలో వారిని బెదిరించినందుకు ఐపిఎస్ అవతారం ఎత్తినట్లు, అందుకు పవన్ కళ్యాణ్ టూర్‌ను అనువుగా ఎంచుకున్నట్లు నిర్ధారించారు. పవన్ కళ్యాణ్ ప్రోగ్రాంలో ఎక్కువ మంది ఉండడంతో పాటు తను డ్యూటీ చేసిన బిల్డప్ కూడా ఇవ్వొచ్చని, ఆ పర్యటనలో తాను డ్యూటీ చేస్తే అందరూ కచ్చితంగా తనను ఐపిఎస్ అనుకుంటారని పవన్ కళ్యాణ్ పర్యటనను ఎంచుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు. ప్రస్తుతానికి నకిలీ ఐపిఎస్ సూర్యప్రకాష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నకిలీ ఐపీఎస్ మాదిరిగానే మావోయిస్టులు చొరబడితే తమ నాయకుడు పరిస్థితి ఏంటని, పోలీసుల భద్రత ఇంత డొల్లతనంగా ఉంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ఇటీవల తమ అభిమాన నాయకుడికి బెదిరింపు కాల్స్ వచ్చాయని, అలా వచ్చిన తర్వాత అయినా అప్రమత్తవ్వకుండా పోలీసులు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా? అని నిలదీస్తున్నారు. ఇదే విషయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతుంది.

About Kadam

Check Also

క్రైమ్‌కు కళ్లెం.. విజయనగరం టూ టౌన్ పోలీసుల యాక్షన్ ప్లాన్ అదుర్స్

రోజురోజుకు పెరుగుతున్న క్రైమ్‌కు కళ్లెం వేసేందుకు పోలీసులు సరికొత్త విధానాలతో ముందుకు సాగుతున్నారు. క్రైమ్ జరగకుండా ముందుస్తు నిఘా పెట్టడంతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *