ఆదిలాబాద్ రూరల్ మండలం యాపలగూడ గ్రామానికి చెందిన రైతు నల్ల విలాస్, నక్కల జగదీష్ , జిల్లాల మోహన్ లకు చెందిన అకౌంట్లలో ఆ డబ్బులు జమ కాలేదు. దీంతో ఏడాదిగా పంట సొమ్ము కోసం తిరిగి తిరిగి అలసిపోయారు రైతులు. చివరికి ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. దీంతో బ్యాంకు అధికారులు తమకు న్యాయం చేయాలని బ్యాంకులో బైఠాయించి ఆందోళన చేపట్టారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రైతులు వినూత్న నిరసన చేపట్టారు. బ్యాంకు సిబ్బంది తీరును నిరసిస్తూ చొక్కాలు తీసేసి.. బ్యాంకులో బైఠాయించి, అర్ధనగ్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఒకటి కాదు రెండు కాదు నాలుగు గంటల పాటు అర్థనగ్న ప్రదర్శన చేసి తమ నిరసనను తెలిపారు రైతులు. తమ అకౌంట్లలలో ఉన్న డబ్బులను ఎస్బీఐ బ్యాంకు అధికారులు రుణమాపి వడ్డీ కింద మాయం చేశారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. బ్యాంకులో రైతులు బైఠాయించి నిరసన తెలుపడంతో ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురయ్యారు బ్యాంక్ సిబ్బంది, కస్టమర్లు.
అసలింతకు ఏం జరిగిందంటే.. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం వడూర్ గ్రామానికి చెందిన జిల్లెల మోహన్ అనే రైతుకు ఆదిలాబాద్ ఎస్బీఐ బ్యాంకులో అకౌంట్ ఉంది. గత ఏడాది పత్తి అమ్మిన డబ్బులను ఆధార్ అనుసందానం కారణంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్‌కు బదిలీ చేసింది సీసీఐ. అయితే, అప్పటి ఆదిలాబాద్ పోస్ట్ ఆఫీస్ మేనేజర్ విజయ్ జాదవ్ రైతుల అకౌంట్లలలో జమ అయిన డబ్బులను మాయం చేసి సైబర్ క్రైమ్ కు పాల్పడ్డాడు. ఈ ఘటనలో కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు రైతుల అకౌంట్లను ఫ్రీజ్ చేశారు.జిల్లా కలెక్టర్ రాజర్షి షా జోక్యంతో ఆ ఫ్రీజ్ అయిన అకౌంట్ల నుండి పత్తి డబ్బులను బాధిత రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసింది పోస్టల్ శాఖ.
అయితే ఆదిలాబాద్ రూరల్ మండలం యాపలగూడ గ్రామానికి చెందిన రైతు నల్ల విలాస్, నక్కల జగదీష్ , జిల్లాల మోహన్ లకు చెందిన అకౌంట్లలో ఆ డబ్బులు జమ కాలేదు. దీంతో ఏడాదిగా పంట సొమ్ము కోసం తిరిగి తిరిగి అలసిపోయారు రైతులు. చివరికి ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. వారి సొమ్ము గతంలో తీసుకున్న రుణానికి వడ్డీ కింద జమ చేసుకున్నారు బ్యాంక్ అధికారులు. దీంతో ఏ చేయాలో తెలియక న్యాయం కోసం.. ఇదిగో ఇలా ఆదిలాబాద్ ఎస్బీఐ బ్యాంకులో అర్థనగ్న ప్రదర్శనకు దిగారు.
గత ఏడాది సీసీఐ నుండి పత్తి డబ్బులు రైతు మోహన్ కు లక్ష రూపాయలు, విలాస్ కు 76,000 లు, నక్కల జగదీష్ కు రూ. 2 లక్షలు రావాల్సి ఉంది. దీంతో బ్యాంకు అధికారులు తమకు న్యాయం చేయాలని బ్యాంకులో బైఠాయించి ఆందోళన చేపట్టారు. నాలుగు గంటల ఆందోళన అనంతరం ఎట్టకేలకు స్పందించిన బ్యాంక్ మేనేజర్ ఉన్నతాధికారులతో మాట్లాడి రైతులను ఒప్పించడంతో ఆందోళన విరమించారు రైతులు.