Kuwait Fire: కువైట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన భారతీయ కార్మికుల కుటుంబాలకు భారత ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.2 లక్షల సాయం ప్రకటించింది. ఈ సహాయాన్ని ప్రధానమంత్రి సహాయనిధి నుంచి అందజేస్తారు.
కువైట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తన అధికారిక నివాసం 7 లోక్‌కల్యాణ్ మార్గ్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, ఈ దురదృష్టకర సంఘటనపై ప్రధాని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపడంతో పాటు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మోడీ ఆకాంక్షించారు.
ఇక, కువైట్ లోని భారతీయులకు అన్ని విధాలా సహాయాన్ని అందించాలని ప్రధాని మోడీ ఆదేశించారు. సహాయ చర్యలను పర్యవేక్షించడంతో పాటు మృతదేహాలను త్వరగా భారత్ కు తిరిగి తీసుకురావడానికి విదేశాంగ శాఖ సహాయ మంత్రిని వెంటనే కువైట్‌కు వెళ్లాల్సిందిగా చెప్పారు. కాగా, దక్షిణ కువైట్‌లోని విదేశీ కార్మికులు నివసిస్తున్న బహుళ అంతస్తుల భవనంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో ఇప్పటి వరకు 50 మంది మరణించారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో 42 మంది భారతీయులే ఉన్నారు.