ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, రాజమహేంద్రవరం వాసులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. గోదావరిపై బోటుపై విహరిస్తూ.. మరోవైపు అక్కడే ఇష్టమైన ఆహారం తింటూ ఆస్వాదిస్తుంటే ఆ కిక్కే వేరు. ఈ అనుభూతిని ప్రజలకు అందించేందుకు సరికొత్తగా ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరం గోదావరిలో రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి, రైల్వే ఆర్చి బ్రిడ్జి మధ్యలోని బ్రిడ్జిలంక దగ్గర ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్‌ను పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ ప్రారంభించారు.
పర్యాటకులు, స్థానికులు రాజమహేంద్రవరం పద్మావతి ఘాట్ సమీపంలోని టూరిజం కంట్రోల్ రూమ్ నుంచి బోటులో బయల్దేరి.. గోదావరి మధ్యలోని ఇసుక తిప్పలను ఆనుకుని నీటిలో తేలియాడే ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్ దగ్గరకు వెళ్లాల్సి ఉంటుంది. రెస్టారెంట్‌లో 170 మంది వరకు కూర్చునేలా సీటింగ్ అందుబాటులో ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 7 గంటల వరకూ ఈ రెస్టారెంట్ అందుబాటులో ఉంటుంది.. ఇక్కడ వెజ్, నాన్‌వెజ్ రకాలు వడ్డిస్తారు. సిల్వర్ స్పూన్, ఆహ్వానం కిచెన్ ప్రాంచైజీస్.. ఆపరేషన్ అండ్ మెయింట్‌నెన్స్ విధానంలో ఈ రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ రెస్టారెంట్ టూరిజం శాఖకు ఏడాదికి రూ.6.5 లక్షల ఆదాయం ఇవ్వాల్సి ఉంటుంది.
రాష్ట్రంలో టూరిజాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు మంత్రి దుర్గేష్. అలాగే త్వరలో హేవలాక్ బ్రిడ్జి సమీపంలో కూడా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని..గోదావరి పుష్కరాల నాటికి నదీ తీరాన్ని అందంగా తీర్చిదిద్దుతామన్నారు. రాబోయే ఐదేళ్ల కాలానికి పర్యాటక రంగంలో అభివృద్ధి కోసం దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. కేరళ కంటే అందమైన ప్రదేశాలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగం అభివృద్ధి చెందకపోవడం శోచనీయమన్నారు.రాష్ట్రానికి ఉన్న సహజమైన ప్రకృతి అందాలతో ఇతర రాష్ట్రాలకన్నా పర్యాటకాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి తద్వారా ఆదాయం పెంపొందించే మార్గాలను అన్వేషిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో పర్యటక రంగాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు.
అందాలొలికే గోదావరి లో బ్రిడ్జి లంక లో ఫ్లోటింగ్ రెస్టారెంట్ ను ప్రారంభించడం పర్యాటకులకు మధురానుభూతిని కలిగిస్తుందన్నారు. ఒకవైపు అందమైన గోదావరి నది, మరోవైపు నర్సరీలు ఆ మధ్యన ఫ్లోటింగ్ రెస్టారెంట్ లో భోజనం చేయడం ప్రతి ఒక్కరూ మధురానుభూతిగా ఉంటుందన్నారు. ఇక్కడ ఎటువంటి అసాంఘిక కార్యకలపాలకు తావులేకుండా చూడాలన్నారు. ఆహ్వానం కిచెన్ ప్రాంచేజీస్ దేశీయంగా మహానగరాల్లో ఒక ప్రత్యేక గుర్తింపును కలిగి ఉందని.. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న ఫ్లోటింగ్ రెస్టారెంట్ విజయవంతంగా కొనసాగాలన్నారు మంత్రి. నిబంధనలు పాటించి పది కాలాల పాటు విజయవంతంగా నిర్వహించడంలో నిబద్ధతతో ఉండాలన్నారు.
పీపీపీ విధానంలో పర్యాటక రంగాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తామన్నారు దుర్గేష్. మంత్రులు, ఎమ్మెల్యేలు, టూరిజం బోర్డ్, అధికారులు అందరం ఐకమత్యంగా పనిచేసి టూరిజంను అభివృద్ధి చేస్తామన్నారు.పర్యాటక రంగంలో పెట్టుబడులు పెరిగే కొద్దీ ఉపాధి కూడా అంతకి పదిఇంతలు స్థాయిలో పెరుగుతుందన్నారు. రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందేందుకు అవసరమైన అన్ని అవకాశాలు ఇక్కడ ఉన్నాయన్నారు.రాష్ట్రంలో స్టూడియోల నిర్మాణం జరిగి చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలని కాంక్షించారు. చిత్ర పరిశ్రమకు విశాఖపట్నం అన్ని విధాల అనుకూల ప్రాంతమని తెలుపుతూ స్టూడియోల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన ప్రోత్సాహం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కేబినెట్ సబ్ కమిటీ లోని దేవదాయ శాఖ, అటవీశాఖ, వైద్య, పర్యాటక శాఖలతో కలిసి రాష్ట్రంలో ఎకో, అడ్వేంచర్, వెల్ నెస్, టెంపుల్ టూరిజంలను అభివృద్ధి చేస్తామని, రాష్ట్ర పర్యాటక అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.