ప్రస్తుతం దేశవ్యాప్తంగా తిరుపతి లడ్డూ అంశం హాట్ టాపిక్‌గా మారింది. తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు వాడారంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణల నేపథ్యంలో ఈ విషయంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వ్యవహారంలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ . ఏఆర్ డెయిరీ నుంచి వచ్చిన ట్యాంకర్లలోనే కల్తీ నెయ్యి వచ్చినట్లు తేలిందని.. స్వయానా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు వెల్లడించారు. ల్యాబ్ టెస్టుల్లో ఈ విషయం తేలిందన్నారు. ఈ క్రమంలోనే తమిళనాడులోని ఏఆర్ డెయిరీలో సోదాలు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తమిళనాడులోని ఏఆర్ డెయిరీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మరోవైపు ఏఆర్ డెయిరీ విషయంలో తమిళనాడు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో తమిళనాడులోని పళణి సుబ్రమణ్యం ఆలయంలోని పంచామృతం ప్రసాదంలోనూ ఏఆర్ డెయిరీ నెయ్యినే వాడుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రచారంపై తమిళనాడు ప్రభుత్వం స్పందించింది. ఇదంతా తప్పుడు ప్రచారమని.. ఇలాంటి వదంతులు నమ్మవద్దంటూ భక్తులకు విజ్ఞప్తి చేసింది. పళణి సుబ్రమణ్యం ఆలయం పంచామృతంలో ఆవిన్ నెయ్యి వాడుతున్నట్లు తెలిపింది. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించింది.
Amaravati News Navyandhra First Digital News Portal