ప్రస్తుతం విజయవాడలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వరదలు పోటెత్తడంతో ఎక్కడి జనం అక్కడే చిక్కుకుపోయారు. ఇక ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో.. సామాన్లు మొత్తం నీళ్లలో మునిగిపోయాయి. ఈ క్రమంలోనే జనం అంతా ఇళ్లపైకి ఎక్కి.. ప్రభుత్వం అందించే సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం హెలికాప్టర్ల ద్వారా రెస్క్యూ చేయడమే కాకుండా ఆహారం, తాగునీరు సరఫరా చేస్తోంది. అయితే హెలికాప్టర్లు అన్ని ప్రాంతాలకు వెళ్లడానికి అవకాశం ఉండకపోవడంతో టెక్నాలజీని వాడాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే డ్రోన్ల ద్వారా ఆహారాన్ని వరద బాధితులకు అందించాలని నిర్ణయించుకుంది. ఆహారంతోపాటు మెడిసిన్, తాగునీటిని కూడా బాధితులకు సరఫరా చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్లతో ఆహారం సరఫరా చేసేందుకు ఏపీ ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి డ్రోన్ల ద్వారా ఆహారం, మెడిసిన్ , తాగునీరు, పాలు వంటివి అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే బోట్లు, హెలికాప్టర్లతో వీటిని పంపిణీ చేస్తుండగా.. అవి వెళ్లలేని ప్రాంతాలకు డ్రోన్లను పంపించాలని అధికారులు నిర్ణయించారు. చిన్న చిన్న ఇరుకు గల్లీలలో ఉన్న వరద బాధితులకు ఆహారం అందించేందుకు ప్రత్యామ్నాయ మార్గాల కోసం ఈ డ్రోన్లను వినియోగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే ఇందుకోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న 3 డ్రోన్లతో విజయవాడ కలెక్టరేట్ ప్రాంగణంలో ట్రయల్ రన్‌ను నిర్వహించింది. ఒక మినీ హెలికాప్టర్‌లా ఉండే ఈ డ్రోన్ల ద్వారా ఆహారం, ఇతర వస్తువులను ఎలా పంపిణీ చేయాలి అనేది పరిశీలించారు.
అయితే విజయవాడ కలెక్టరేట్‌లో డ్రోన్ సరఫరాను స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రయల్ రన్‌ను పర్యవేక్షించారు. ఈ ట్రయల్ రన్ తర్వాత దాదాపు 8 కిలోల నుంచి 10 కిలోల వరకు ఆహారం, తాగునీరు, మెడిసిన్ సహా వివిధ రకాల వస్తువులను ఇంటి వద్దకే తీసుకెళ్లి అందించవచ్చని అధికారులు ఒక అంచనాకు వచ్చారు. అయితే ఈ డ్రోన్లను ఏ మేరకు వినియోగించుకోవచ్చో ఒక అంచాకు వచ్చి.. మరిన్ని ఫుడ్ డెలివరీ డ్రోన్లను రెడీ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ట్రయల్ రన్‌కు 3 ఫుడ్ డెలివరీ డ్రోన్లను ఉపయోగించగా.. మరో 5 డ్రోన్లు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు.. ముఖ్యమంత్రికి వివరించారు.