ఏపీలో వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పిఠాపురంలో పెండెం దొరబాబు, అనంతపురంలో పైలా నర్సింహయ్య రాజీనామాలు చేసిన ఘటనలు మరువకముందే మరో కీలక నేత ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. వైసీపీకి మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) రాజీనామా చేశారు. ఏలూరు జిల్లా అధ్యక్ష పదవితో పాటుగా.. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆళ్ల నాని ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో ప్రత్యక్ష రాజకీయాలకు ఇకపై దూరంగా ఉండనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు పంపించారు.
1999లో ఏలూరు అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆళ్ల నాని తొలిసారిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అంబికా కృష్ణ చేతిలో ఓటమి పాలయ్యారు. 2004, 2009లో ఏలూరు నుంచే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి వరుసగా విజయం సాధించారు. 2014లో వైసీపీ తరుఫున ఏలూరు నుంచి పోటీచేసిన ఆయన.. టీడీపీ అభ్యర్థి బడేటి కోట రామారావు చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీచేసి విజయం సాధించిన ఆళ్ల నాని.. వైఎస్ జగన్ మంత్రివర్గంలో డిప్యూటీ సీఎంగా, వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. అయితే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవిని కోల్పోయారు.
అయితే 2024 ఎన్నికల్లో మరోసారి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆళ్ల నాని.. బడేటి రాధాకృష్ణయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. ఎన్నికల ఫలితాల తర్వాత మౌనంగా ఉన్న ఆయన.. తాజాగా ప్రత్యక్ష రాజకీయాల్లో నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ సభ్యత్వానికి. ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు ఇటీవలే అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి పైలా నర్సింహయ్య రాజీనామా చేశారు. బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కూడా వైసీపీ ఇంఛార్జి పదవికి రాజీనామా చేశారు.