తెలంగాణలో ఏర్పాటు చేసిన విద్యుత్ కమిషన్‌కు కొత్త ఛైర్మన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ఛైర్మన్‌గా గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ మదన్ బీ లోకూర్‌ను నియమిస్తూ.. మంగళవారం (జులై 30న) ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ మదన్ బీ లోకూర్.. 2011లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించారు. మొదట నియమించిన జస్టిస్ నర్సింహా రెడ్డిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో.. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కొత్త ఛైర్మన్‌గా జస్టిస్ మదన్ బీ లోకూర్‌ను నియమించగా.. విచారణలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోనున్నాయన్నది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
అయితే.. తెలంగాణలో గత ప్రభుత్వం నేపథ్యంలో విద్యుత్ కొనుగోళ్లతో పాటు యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణంలోనూ.. అవకతవకలు జరిగాయంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. రేవంత్ రెడ్డి సర్కార్ జ్యుడీషియల్ విచారణ కోసం కమిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఛైర్మన్‌గా జస్టిస్ నర్సింహా రెడ్డి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేయగా.. దానిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటు చేసిన కమిషన్‌పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
అయితే.. విద్యుత్ ఒప్పందాల విషయంలో తమపై కమిషన్‌ను ఏర్పాటు చేయడాన్నే సవాలు చేసిన మాజీ సీఎం కేసీఆర్.. ఆ కమిషన్‌ను రద్దు చేసేలా ఆదేశాలివ్వాలని ధర్మాసనాన్ని కోరారు. అయితే.. కేసీఆర్ తరఫున ముకుల్ రోహత్గి, తెలంగాణ ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లూథ్రా, కమిషన్ తరఫున గోపాల్‌శంకర్ నారాయణన్ తమ వాదనలు వినిపించారు. అయితే ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా త్రిసభ్య ధర్మాసనం జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది.
విచారణ పూర్తి కాకముందే జస్టిస్ నరసింహారెడ్డి ఓ అభిప్రాయానికి వచ్చారంటూ కోర్టు ఆక్షేపించింది. నింబంధనలకు విరుద్ధంగా కమిషన్ ఛైర్మన్ ప్రెస్‌మీట్ పెట్టడం సరికాదంటూ అభిప్రాయపడింది. దీంతో.. కమిషన్ ఛైర్మన్‌ను మార్చాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. సుప్రీం ఆదేశాల మేరకే.. ఇప్పుడు కొత్త ఛైర్మన్‌గా జస్టిస్ మదన్ బీ లోకూర్‌ను సర్కార్ నియమించింది.