Mutton: నాన్ వెజ్ ప్రియులు మాంసాన్ని ఇష్టంగా తింటారు. అలాగే ఓ కుటుంబం కూడా మటన్ తెచ్చుకుని తిన్నారు. ఆ కుటుంబంలోని నలుగురు సభ్యులు మాంసం తిని.. ఆ తర్వాత అందులో ఇద్దరు తమ పనులకు వెళ్లిపోయారు. అయితే వాంతులు, విరేచనాలు కావడంతో వారు తిరిగి ఇంటికి వచ్చారు. అయితే అప్పటికే ఇంట్లో ఉన్న ఇద్దరు కూడా వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. ఈ క్రమంలోనే వారు చికిత్స పొందుతూ నలుగురు ప్రాణాలు కోల్పోవడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఒకే కుటుంబంలోని నలుగురు సభ్యులు.. మటన్ తిని చనిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ విషాదకర ఘటన కర్ణాటక రాయచూర్ జిల్లా సిరివారలోని కల్లూరు గ్రామంలో చోటు చేసుకుంది.
కల్లూరు గ్రామానికి చెందిన 60 ఏళ్ల భీమన్న.. బుధవారం ఇంటికి మటన్ తీసుకువచ్చాడు. దీంతో అతని భార్య 50 ఏళ్ల ఈరమ్మ ఆ మటన్ వండింది. ఆ తర్వాత వారిద్దరితోపాటు కుమార్తె 17 ఏళ్ల పార్వతి.. కుమారుడు 19 ఏళ్ల మల్లేష్ కలిసి ఆ మటన్ తిన్నారు. ఆ తర్వాత పార్వతి, మల్లేష్ పొలం పనులు చేసుకునేందుకు చేనులోకి వెళ్లారు. ఈ క్రమంలోనే అక్కడ పనిచేస్తుండగా.. వారికి వాంతులు విరేచనాలు అయ్యాయి. మొదట పార్వతి తనకు వాంతులు అవుతున్నట్లు మల్లేష్‌కు తెలపగా.. తనకు కూడా అదే పరిస్థితి ఉన్నట్లు తెలిపాడు. దీంతో వారిద్దరూ ఇంటికి వచ్చి చూసేసరికి తల్లి ఈరమ్మ, తండ్రి భీమన్న కూడా వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు.
దీంతో ఫుడ్ పాయిజన్ అయిందని వారంతా గుర్తించారు. వెంటనే వారు నలుగురు స్థానిక ఆస్పత్రిలో చేరారు. అయితే వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో స్థానిక డాక్టర్లు.. రాయచూరు రిమ్స్‌కు తరలించారు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి చికిత్స పొందుతూ వారు నలుగురు ఆస్పత్రిలోనే ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘటనకు కారణం ఏంటి అనేది మాత్రం ఇప్పటివరకు తెలియరాలేదు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు. అయితే వారు వండుకుని తిన్న మటన్ ఫుడ్ పాయిజన్ అయిందా.. లేక ఆ కుటుంబంపై ఏదైనా విషప్రయోగం జరిగిందా అనే దిశగా పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఇక ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే హంపయ్య నాయక్ హుటాహుటిన రాయచూరు రిమ్స్‌కు వెళ్లి వారిని పరామర్శించారు. ఆస్పత్రిలోని మార్చురీలో వారి మృతదేహాలను ఎమ్మెల్యే పరిశీలించారు. మరోవైపు.. వారు తిన్న ఆహారం నమూనాలను సేకరించినట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఇటీవల రాజస్థాన్‌లోని జైపూర్ నుంచి బెంగళూరుకు మటన్ పేరుతో కుక్క మాంసం సరఫరా చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగి.. ఆ మాంసాన్ని ల్యాబ్‌కు తరలించి టెస్ట్ చేసిన తర్వాత.. అది కుక్క మాంసం కాదని.. మటన్ అని తేల్చారు. వేరే రకమైన జాతి మేకల మాంసం అని గుర్తించారు.