Kolkata Trainee Doctor: బెంగాల్ ట్రైనీ డాక్టర్ హత్య కేసులో పోలీసుల ట్విస్ట్.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఏముందంటే?

Kolkata Trainee Doctor: పశ్చిమ బెంగాల్‌లో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన హత్యాచారం ఘటన మొత్తం దేశాన్ని కుదిపేస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ట్రైనీ డాక్టర్‌ పోస్టుమార్టంకు సంబంధించిన రిపోర్టులో సంచలన విషయాలు వెలుగుచూశాయని నెటిజన్లు కోడై కూస్తున్నారు. ఆ ట్రైనీ డాక్టర్‌పై గ్యాంగ్ రేప్ జరిగిందని.. ఆమె ఎముకలు విరిగిపోయాయని.. ఇక మరీ ముఖ్యంగా ఆమె శరీరంలో 150 మిల్లీ గ్రాముల వీర్యం ఉందని రకరకాల ఊహాగానాలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయాలు వైరల్ కావడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లువెత్తేలా చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కోల్‌కతా పోలీసులు స్పందించారు. వాటిలో ఎలాంటి వాస్తవం లేదని కొట్టిపారేశారు. అనవసర వార్తలు విని.. జనం ఆగ్రహానికి గురికావద్దని సూచించారు.

పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని ఆర్‌జీ కార్‌ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఈనెల 8 వ తేదీన 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటనలో ఎన్నో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అవన్నీ ప్రజలను ఎంతో ఆందోళనకు, ఆగ్రహానికి గురయ్యేలా చేస్తుండటంతో.. అందులో సంచలన విషయాలు నిజం కాదని తాజాగా కోల్‌కతా పోలీసులు స్పష్టం చేశారు. ఇక ఆ యువతిపై సామూహిక అత్యాచారం జరిగిందని.. ఆమె శరీరంలో ఎముకలు విరిగిపోయాయని.. 150 మిల్లీగ్రాముల వీర్యం ఆమె శరీరంలో ఉందనే వార్తలు ప్రధానంగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే అవన్నీ తప్పుడు వార్తలేనని పోలీసులు ఖండించారు.

ఆ ట్రైనీ డాక్టర్‌ మృతదేహానికి నిర్వహించిన పోస్టుమార్టం ప్రక్రియ మొత్తం మేజిస్ట్రేట్‌ ఎదుట జరిగిందని.. దాన్ని మొత్తం వీడియో తీశారని కోల్‌కతా పోలీసులు వెల్లడించారు. అందులో ఎక్కడా ఆమె శరీరంలో ఎముకలు విరిగినట్లు ప్రస్తావించలేదని చెప్పారు. ఇక ఆ ట్రైనీ డాక్టర్‌పై సామూహిక అత్యాచారం జరిగిందని కూడా వార్తలు వచ్చాయని.. దానికితోడు ఆమె శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉన్నట్లు పోస్టుమార్టంలో గుర్తించారని వైరల్ అయిందని.. అందుకు ఆమె తల్లిదండ్రులు కోర్టులో వేసిన పిటిషనే మూలం అని పలు వార్తలు వెల్లువెత్తాయి. వీటిని కోల్‌కతా పోలీసులు ఖండించారు.

ఆ ట్రైనీ డాక్టర్ శరీరంలో 150 మిల్లీ గ్రాముల వీర్యం గుర్తించినట్లు కొందరు చెప్పారని.. అయితే వారికి ఇలాంటి సమాచారం ఎక్కడ దొరుకుతుందో తెలియడం లేదని కోల్‌కతా పోలీస్‌ చీఫ్ వినేష్ గోయల్‌ వెల్లడించారు. ఇలాంటి వార్తలు మీడియాలో వివిధ రకాలుగా వైరల్ అవుతోందని.. అయితే ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకే ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని వినేష్ గోయల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ఇక ఆమె మృతిని అసహజ మరణంగా పోలీసులు కేసు నమోదు చేయడం పలు అనుమానాలకు తావిస్తోందని ఇటీవల కలకత్తా హైకోర్టు పేర్కొంది. అదే సమయంలో ఆర్‌జీ కర్ ఆస్పత్రిపై కేసు నమోదు చేయకపోవడంపైనా ప్రశ్నించింది. అయితే దీనిపై స్పందించిన పోలీసులు.. ఏదైనా మృతి ఘటనలో ఎలాంటి ఫిర్యాదు కానపుడు ముందుగా అసహజ మరణంగానే నమోదు చేస్తారని.. ఎవరైనా ఫిర్యాదు చేసినా, పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా మాత్రమే అది హత్యానా లేక ఆత్మహత్యానా అనేది ప్రస్తావిస్తారని చెప్పారు. ఎలాంటి ఫిర్యాదు లేనప్పుడు అసహజ మరణంగా కేసు నమోదు చేస్తారని.. అంతమాత్రాన హత్య విషయాన్ని దాచిపెట్టి, ఆత్మహత్యగా చూపించాలని అనుకుంటున్నామని ఎందుకు వార్తలు వస్తున్నాయో అని కోల్‌కతా పోలీస్ చీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని పోస్టులు.. మృతి చెందిన ట్రైనీ డాక్టర్ తోటి డాక్టర్లను అనుమానితులుగా పేర్కొన్నాయి. ఇక కొందరి పేర్లను బాధితురాలి తల్లిదండ్రుల పేర్లతో కూడిన జాబితాను సీబీఐకి ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక్క వాలంటీర్‌ పేరు మినహా ఇప్పటివరకు ఏ ఏజెన్సీ కూడా ఇతర అనుమానితుల పేర్లను రికార్డుల్లో నమోదు చేయలేదు. ఇక ఈ కేసులో ఓ పెద్ద రాజకీయ నాయకుడి కుమారుడి ప్రమేయం ఉందంటూ వచ్చిన వార్తలను కూడా పోలీసులు తోసిపుచ్చారు. ఇక ఆ జూనియర్ డాక్టర్ పేరుతో ఉన్న ధ్రువీకరించని ఒక ప్రిస్క్రిప్షన్ కాపీ వైరల్ అయింది. దీంతో అత్యాచార కేసుల్లో బాధితురాలికి సంబంధించి ఎలాంటి వివరాలు బయటకు వెల్లడించకూడదని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించడమే అవుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు.. ఆర్‌ కర్ మెడికల్ కాలేజీలో పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్న ఆ జూనియర్‌ డాక్టర్‌ ఆగస్టు 8 వ తేదీన రాత్రి డ్యూటీలో ఉండగా.. తెల్లవారుజామున ఉదయం ఆస్పత్రి సెమినార్‌ హాలులో శవమై కనిపించింది. ఈ కేసులో పోలీస్ వాలంటీర్‌ అయిన నిందితుడు సంజయ్‌ రాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా.. ప్రస్తుతం ఈ కేసును కలకత్తా హైకోర్టు.. సీబీఐకి బదిలీ చేసింది. ఇక ఈ కేసు దర్యాప్తును ఆదివారం వరకు పూర్తి చేయాలని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. పోలీసులు, సీబీఐకి అల్టిమేటం జారీ చేశారు. అంతేకాకుండా నిందితుడికి ఉరిశిక్ష విధించాలని ఆమె డిమాండ్ చేశారు.

About amaravatinews

Check Also

Election Results 2024 Live: ఎన్డీయే, ఇండియా కూటమిలకు అగ్ని పరీక్ష

మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని 45 శాసనసభ సీట్లు, రెండు పార్లమెంట్ స్థానాలకు జరిగిన ఉప …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *