RBI Loans: ఇప్పుడు అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు కోసం చాలా మంది లోన్ల వైపు చూస్తుంటారు. కొన్నింట్లో ప్రాసెస్ ఈజీగానే ఉన్నప్పటికీ.. కొన్నింట్లో మాత్రం లోన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సులు కూడా ఉంటాయి. ఇంకా డాక్యుమెంటేషన్ అవసరం పడుతుంది. అర్హతలు సరిపోవు. ఆదాయం సరిపోదు. సిబిల్ స్కోరు సరిగా లేదన్న కారణంతో లోన్ అప్లికేషన్ తిరస్కరణకు గురికావొచ్చు. ఈ రోజుల్లో చాలా మంది లోన్లు ఈజీగానే వేగంగానే పొందుతున్నారు. అయితే అందరు మాత్రం కాదు. అన్ని డాక్యుమెంట్లు లేకుండా.. సరైన క్రెడిట్ హిస్టరీ లేకుండా బ్యాంక్ నుంచి లోన్ పొందడం మాత్రం చాలా కష్టమైన పనే. మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడకపోతే.. లోన్ కోసం బ్యాంకులకు పలు మార్లు వెళ్లాల్సి ఉంటుంది. అప్పటికీ లోన్ గ్యారెంటీగా వస్తుందో రాదో చెప్పలేని పరిస్థితి. వీటన్నింటికీ త్వరలోనే పరిష్కారం రాబోతుంది. వీటితో పెద్దగా పనిలేకుండానే.. కొత్త ప్లాట్‌ఫాం సాయంతో వేగంగా లోన్లు మంజూరు చేసే దిశగా ఆర్బీఐ కొత్త సేవలు తెస్తోంది.
పెద్ద సంఖ్యలో రుణ గ్రహీతలకు ఉపశమనం కలిగించేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. లోన్ల జారీని మరింత సులభతరం చేసే దిశగా.. న్యూ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్ (ULI) తీసుకురాబోతుంది. ఇది ఒక డిజిటల్ ప్లాట్‌ఫాం. ఇది రుణాల జారీ ప్రక్రియను క్రమబద్ధీకరించి.. మరింత సులభతరం చేస్తుందని చెప్పారు స్పైస్ మనీ ఫౌండర్ అండ్ సీఈఓ దిలీప్ మోడీ. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు పంట రుణాల జారీకి, చిన్న మొత్తాల్లో లోన్లు పొందాలనుకునే చిన్న వ్యాపారులు వంటి వారికి ఈజీగా లోన్లు అందించేందుకు తోడ్పడుతుంది.
యూఎల్ఐని ఇండియాలో మరో యూపీఐగా చెప్పొచ్చు. యూపీఐలా ప్రాచుర్యం కల్పించాలని ఆర్బీఐ చూస్తోంది. యూఎల్ఐ అనేది.. సదరు రుణ గ్రహీత సంబంధిత సమాచారాన్ని అంతా ఒకే ప్లాట్‌ఫాంలో నిక్షిప్తం చేస్తుంది. ఇక్కడ ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ సమాచారం పొందొచ్చు. రుణ గ్రహీత అర్హతను నిర్ధరించేందుకు.. ఆధార్, ఇ- కేవైసీ రికార్డులు, పాన్ వివరాలు, స్టేట్ ల్యాండ్ రికార్డ్స్ వంటివి సరిపోతాయని భావిస్తోంది.
రియల్ టైమ్ ప్రాతిపదికన రుణ గ్రహీత డేటా మొత్తం ఒకే ప్లాట్‌ఫాంలో కనిపిస్తుంది. దీంతో రుణం పొందే అర్హతను తెలుసుకునేందుకు పెద్దగా సమయం అవసరం లేదు. దీంతో లోన్ అప్లికేషన్ల పరిశీలన, జారీ ఈజీ అయిపోతుంది. బ్యాంక్ బ్రాంచ్‌ను సందర్శించాల్సిన అవసరం లేకుండానే సమయాన్ని ఆదా చేస్తూ క్షణాల్లో లోన్ పొందే వెసులుబాటును కూడా ఇది కల్పిస్తుందని తెలుస్తోంది. ఏడాది కిందటే ఆర్బీఐ.. ఈ యూఎల్ఐని పైలట్ ప్రాజెక్ట్ కింద లాంఛ్ చేయగా.. త్వరలోనే దీనిని ప్రజల కోసం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. పర్సనల్ లోన్లు, ఎలాంటి తాకట్టు లేకుండానే MSME లోన్లు, డెయిరీ లోన్లు, హోం లోన్స్, కిసాన్ క్రెడిట్ కార్డులు వంటివి ఆఫర్ చేయనున్నట్లు సమాచారం.