Hyderabad Gold Rates: భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టం ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా భారత మహిళలు బంగారు ఆభరణాల్ని ధరించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇది ఎక్కువగా పండగలు, ఇతర శుభకార్యాలు, వేడుకల సమయాల్లో ఎక్కువగా ఉంటుంది. అంటే ఆ సమయాల్లో కొనుగోలు చేసి ధరిస్తుంటారు. దీంతో డిమాండ్ కూడా అప్పుడు భారీగానే ఉంటుంది. ఇటీవలి కాలంలో మాత్రం ఈ డిమాండ్‌తో పెద్దగా పని లేకుండానే ఇతర కొన్ని కారణాలతో గోల్డ్ రేట్లలో భారీ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అంతకుముందు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను గరిష్ట స్థాయికి చేర్చి.. మళ్లీ తగ్గిస్తుందని సంకేతాలు వచ్చిన క్రమంలో.. ఏప్రిల్, మే సమయాల్లో రేట్లు భారీగా ఎగబాకాయి. తర్వాత కూడా గరిష్ట స్థాయిల్లోనే కొనసాగాయి. అయితే జులై 23న బడ్జెట్లో కేంద్రం ప్రకటనతో పసిడి ధరలు దిగిరావడం మొదలైంది.
బంగారం, వెండి వంటి లోహాలపై కస్టమ్స్ సుంకాన్ని కేంద్రం భారీగా తగ్గించిన క్రమంలోనే.. వీటి రేట్లు దేశీయ మార్కెట్లో భారీగా పడిపోయాయి. బడ్జెట్ రోజు 22 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 2800, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 3 వేలు పతనమైంది. తర్వాత ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా రేట్లు పతనం కాగా.. దేశీయంగా మరో రెండో రోజులు రూ. 1000 చొప్పున దిగొచ్చింది. ఈ క్రమంలోనే వారం వ్యవధిలో రూ. 7 వేల వరకు తగ్గింది. మళ్లీ ఆగస్ట్ 9,10ల్లో పుత్తడి ధరలు పెరిగాయి. ఇప్పుడెలా ఉన్నాయో చూద్దాం.
హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం 22 క్యారెట్స్ గోల్డ్ రేటు తులం రూ. 64,450 వద్ద స్థిరంగా ఉంది. ఇదే 24 క్యారెట్ల బంగారం రేటు చూస్తే 10 గ్రాములు రూ. 70,310 వద్ద ట్రేడవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇటీవల వరుసగా పెరిగిన బంగారం ధరలు తగ్గుతున్నాయి. ఇక్కడ 22 క్యారెట్స్ పసిడి రేటు 10 గ్రాములకు రూ. 64,600 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ రేటు తులం రూ. 70,460 వద్ద ఉంది.
బంగారం ధరలతో పాటుగానే వెండి రేట్లు కూడా స్థిరంగానే ఉన్నాయి. ఢిల్లీలో కేజీ వెండి రూ. 83 వేల వద్ద ఉంది. అంతకుముందు రెండు రోజుల్లో రూ. 100, రూ. 1500 చొప్పున పెరిగింది. ఇదే హైదరాబాద్ నగరంలో చూస్తే ప్రస్తుతం సిల్వర్ రేటు కేజీ రూ. 88 వేల మార్కు వద్ద ఉంది.
ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఫ్లాట్‌గా ఉన్నాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2429 డాలర్ల వద్ద ఉంది. స్పాట్ సిల్వర్ ధర చూస్తే ప్రస్తుతం 27.43 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 83.978 వద్ద ఉంది.