రైతులకు రేవంత్ సర్కార్‌ గుడ్‌న్యూస్.. ఎన్నికలకు ముందే “రైతు భరోసా” నిధుల విడుదల!

తెలంగాణంలో రైతు భరోసా నిధులు చెల్లింపులకు సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో రైతు భరోసా నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైంది. వానాకాలం సాగు ప్రారంభానికి ముందు రైతులకు పెట్టుబడి సాయంగా ‘రైతు భరోసా’ నిధులు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఆర్థిక వనరుల సమీకరణపై దృష్టి పెట్టిన ప్రభుత్వం, వచ్చే 10 నుంచి 15 రోజుల్లో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయాలన్న ఆలోచనలో ఉంది.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రభుత్వ పథకాలలో రైతు భరోసా కూడా ఒకటి. ఈ పథకాన్ని గత ప్రభుత్వం రైతు బంధు పేరుతో అమల్లోకి తీసుకురాగా.. తర్వాత వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు భరోసా పేరుతో దీన్ని కొనసాగిస్తుంది. దేశానికి వెన్నముక్క వంటి రైతులు పంటలు పండించేందుకు పెట్టుబడి సాయం అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి ఎకరానికి రూ.12 వేల ఆర్థిక సహాయం అందుతుంది. ఈ మొత్తం ఖరీఫ్, రబీ సీజన్లకు గాను ఒక్కో విడతలో రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయబడుతుంది. అయితే తాజాగా వర్షాకాల పంటలు ప్రారంభం కావడంతో మరోసారి రైతు భరోసా నిధులు ప్రజల ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం దీనిపైనే ఫోకస్ పెట్టింది. త్వరలోనే ప్రజల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేసేందుకు కసరత్తు చేస్తోంది.

ఆర్బీఐ నుంచి రూ.7 వేల కోట్ల రుణం

తెలంగాణంలో రైతు భరోసా నిధులు చెల్లింపులకు సమయం ఆసన్నం కావడంతో నిధులు సమకూర్చడంపై తెలంగాణ ఆర్థిక శాఖ సమీకరణపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ నుంచి రూ.3 వేల కోట్ల రుణం తీసుకుంది. శుక్రవారం మరో రూ.4 వేల కోట్ల రుణం కోసం అభ్యర్థన పెట్టింది. మొత్తం రూ.7 వేల కోట్ల నిధులు వానాకాలం రైతు భరోసా కోసం వినియోగించే యోచనలో ఉంది. ఈ మొత్తం జూన్ 17 నాటికి రాష్ట్ర ఖజానాకు చేరే అవకాశం ఉంది.

గత సీజన్లలో పరిస్థితి ..!

2023-24 యాసంగి సీజన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పేరిట 1.52 కోట్ల ఎకరాలకు రూ.7,625 కోట్లు పంపిణీ చేసింది. అయితే గత వానాకాలం సీజన్‌లో సాయం ఇవ్వలేదు. మొన్నటి యాసంగిలో 84 లక్షల ఎకరాలకు రూ.5,058 కోట్లు మాత్రమే విడుదల చేసి, 4 ఎకరాల లోపు భూమి కలిగిన రైతులకే ఈ సహాయం పరిమితం చేసింది. ప్రస్తుత వానాకాలం సీజన్‌లో 1.30 కోట్ల ఎకరాల్లో సాగు జరుగుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ సారి మొత్తం రైతులకు పెట్టుబడి సాయం అందించాలంటే సుమారు రూ.7,800 కోట్లు అవసరమని ప్రభుత్వం లెక్కలు వేసింది.

కేబినెట్ భేటీలో నిర్ణయం..

అయితే, ఈ నెల నాలుగో వారంలో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో రైతు భరోసా పంపిణీపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. అలాగే ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కూడా చర్చించనున్నారు. జూన్ చివర్లో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉండడంతో దీనిపై కూడా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.

ఎన్నికల ముందు రైతుల మద్దతు దక్కించుకోవాలన్న వ్యూహం..

2023 డిసెంబర్‌లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనవరి ఫిబ్రవరిలోనే స్థానిక ఎన్నికలు జరపాలని భావించింది. కానీ లోక్‌సభ ఎన్నికలు, కులగణన కారణంగా ఆలస్యమైంది. ఇప్పుడు ఎన్నికల ముందే రైతులకు నిధులు చెల్లించి, సానుకూల ప్రజాభిప్రాయం రాబట్టాలన్నది రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా రైతుల మద్దతు సమీకరించడంతోపాటు, రాజకీయంగా కూడా లాభదాయకంగా మలచుకోవాలన్న దిశగా ముందుకెళ్తోంది.

About Kadam

Check Also

ఎమ్మెల్సీ కవిత ఇంటికి వాస్తు దోషం.. అందుకే ఇన్ని ఇబ్బందులా..?

ఆ ప్రధాన ద్వారం వల్లనే ఎమ్మెల్సీ కవిత జైలు పాలయ్యారా? ఆ గేటు అక్కడ ఉండడం వలన రాజకీయంగా ఇబ్బందులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *