ఆంధ్రప్రదేశ్ వాసులకు శుభవార్త. ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. నూతన విమానాశ్రయాల ఏర్పాటు దిశగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లో 6 కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ఆరు ప్రాంతాల్లో విమానాశ్రయాల ఏర్పాటుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఫీజిబిలిటీ స్టడీ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.1.92 కోట్లు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఆరు విమానాశ్రయాల అభివృద్ధికి సంబంధించి ఫీజబులిటీ స్టడీ కోసం నిధులు విడుదల చేస్తామని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఇటీవల వెల్లడించారు. ఈ క్రమంలోనే రూ.1.92 కోట్లు విడుదల చేశారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పంతో పాటుగా, శ్రీకాకుళం, నాగార్జునసాగర్, తాడేపల్లిగూడెం, తుని – అన్నవరం, ఒంగోలులో కొత్త ఎయిర్‌పోర్టులు నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. ఇదే విషయమై ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలను పంపించింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్‌లో నూతన విమానాశ్రయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోంది. ఈ క్రమంలోనే కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి అవసరమైన భూములు ఉన్నాయా లేదా.. రాష్ట్రం ప్రతిపాదించిన ప్రాంతాల్లో నూతన విమానాశ్రయాల ఏర్పాటుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఫీజబులిటీ స్టడీ నిర్వహించాలని నిర్ణయించింది.
ఈ నేపథ్యంలోనే విమానాశ్రయాల నిర్మాణానికి ఆవసరమైన భూముల్ని గుర్తించి.. నివేదికలు పంపాలంటూ ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దీంతో ఆరుచోట్ల నూతన విమానాశ్రయాల ఏర్పాటుకు అవసరమైన భూముల వివరాలను స్థానిక జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి పంపారు. నాగార్జునసాగర్‌లో 1,670 ఎకరాలు, శ్రీకాకుళంలో 1,383 ఎకరాలు, ‘కుప్పంలో 1,501 ఎకరాలు, తుని-అన్నవరంలో 787 ఎకరాలు, ఒంగోలులో 657 ఎకరాలు, తాడేపల్లిగూడెంలో 1,123 ఎకరాల భూములు అందుబాటులో ఉన్నట్లు ప్రభుత్వానికి నివేదించారు. తాజాగా ఆయా ప్రాంతాల్లో విమానాశ్రయాల నిర్మాణంపై ఫీజబులిటీ స్టడీ కోసం రూ.1.92 కోట్లు విడుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కొత్త ఎయిర్‌పోర్టుల దిశగా వేగంగా అడుగులు పడుతున్నట్లు భావించవచ్చు.