ప్రకాశం జిల్లాలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఘనకార్యం ఆలస్యంగా బయటపడింది.. గౌరవప్రదమైన వృత్తిలో ఉంటూ తోటి ఉద్యోగుల్ని, జనాల్ని నిండా ముంచేశారు. ఉన్నట్టుండి ఆయన కనిపించకపోవడంతో అనుమానం వచ్చింది.. తీరా ఆరా తీస్తే ఆయన చేతిలో మోసపోయినట్లు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బేస్తవారపేటకు చెందిన కిషోర్‌కుమార్.. కొత్త మల్లాపురం ప్రాథమిక పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (ప్రభుత్వ ఉపాధ్యాయుడి)గా పనిచేస్తున్నారు. ఆయన తోటి ఉపాధ్యాయులు, స్థానికులు, వ్యాపారుల్ని.. చీటిపాటలు, ప్లాట్ల వ్యాపారం పేరుతో మాయ మాటలు చెప్పి మోసం చేశారు.
కిషోర్ కుమార్ మెడికల్ లీవ్ పెట్టి భార్య, పిల్లలతో కలిసి ఏడాది క్రితం పరారయ్యారు.. అప్పట్లోనే బాధితులు గత ఎస్పీ మల్లికాగార్గ్‌కు స్పందనలో ఫిర్యాదు చేశారు. ఎస్పీ వెంటనే స్పందించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సిందిగా బేస్తవారపేట ఎస్సై ఆదేశాలు జారీ చేశారు. దీంతో కిషోర్‌కుమార్‌పై చీటింగ్, చిట్ ఫండ్ కేసులు నమోదు చేసి అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమలో ఆగస్టు 8న హైదరాబాద్‌లో ఉన్న కిషోర్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని బేస్తవారపేట పోలీస్ స్టేషన్‌కు తరలించగా.. కోర్టు రిమాండ్ విధించింది.
పోలీస్ స్టేషన్‌లో పోలీసులు అతడిపై విచారణ చేపట్టగా.. కిషోర్ కుమార్ దాదాపు రూ.6.70 కోట్ల మేర చీటి పాటలతో పాటు, పలువురి దగ్గర అప్పు తీసుకుని మోసం చేసి పరారైనట్లు తేలింది. ఆయనకు రిమాండ్ అనంతరం బెయిల్ రావడంతో.. తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు.ఈయనపై తాజాగా.. నాడు-నేడు పనుల్లో కూడా చేతివాటం చూపించారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. గతంలో ఎప్పుడో ఈ వ్యవహారమంతా జరగ్గా.. తాజాగా కిషోర్ కుమార్ ఘనకార్యం బయటపడింది.