బ్యాంకులో అకౌంట్ ఉన్న వారికి బిగ్ అలర్ట్. ప్రభుత్వం బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు- 2024ను లోక్‌సభలో శుక్రవారం ప్రవేశపెట్టింది. బ్యాంక్ ఖాతాలకు నామినీల సంఖ్యను పెంచేలా మార్పులు చేసింది. ఇప్పటి వరకు ఒక నామినీనే ఎంచుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ సంఖ్యను నాలుగుకు పెంచుతూ బ్యాంకింగ్ చట్టాల్లో సవరణలు చేసినట్లు కేంద్ర ప్రభుత్వ అధికారిక వర్గాలు తెలిపాయి. చట్ట సవరణ బిల్లుకు ఆమోదం లభించిన తర్వాత బ్యాంకు ఖాతాదారులు తమ అకౌంట్లకు నలుగురు నామినీలను ఎంచుకునే అవకాశం లభిస్తుంది. ఈ నిర్ణయం ద్వారా బ్యాంకు ఖాతాల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్ల సమస్యకు పరిష్కారం లభిస్తుందని కేంద్రం భావిస్తోంది.
దీంతో పాటు డైరెక్టర్‌షిప్ హోదా కోసం ఉండాల్సిన కనీస వాటా పరిమితిని పెంచేలా చట్ట సవరణ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న పరిమితి రూ.5 లక్షల నుంచి రూ. 2 కోట్లకు పెంచనున్నట్లు తెలుస్తోంది. ఆరు దశాబ్దాలుగా రూ.5 లక్షల పరిమితి కొనసాగుతోంది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మార్పులు చేయలేదు. ఈ బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. మరోవైపు.. సహకార బ్యాంకులకు సంబంధించి సైతం బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లులో కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. చట్టబద్ధత గల ఆడిటర్లకు చెల్లించే పరిహారాన్ని నిర్ణయించుకునే స్వేచ్ఛను పూర్తిగా బ్యాంకులకే ఇవ్వాలని కేంద్రం ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అలాగే బ్యాంకుల రిపోర్టింగ్ తేదీలను రెండు, నాలుగో శుక్రవారాలు కాకుండా ప్రతి నెలలో 15వ తేదీ, చివరి తేదీలకు మార్పులు చేసినట్లు సమాచారం.