ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఊరట దక్కింది. ఆయనపై నమోదైన క్రిమినల్ కేసును తొలగిస్తూ గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. పవన్ కళ్యాణ్ గతేడాది జులై 9న ఏలూరులో నిర్వహించిన వారాహి సభలో మాట్లాడారు. కొంతమంది వాలంటీర్లు అసాంఘిక శక్తులుగా మారారని ఆరోపించారని ఎన్టీఆర్, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన కొంతమంది ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదుల ఆధారంగా ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఆదేశిస్తూ.. అప్పటి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ అదే నెల 20న ఉత్తర్వులు ఇచ్చారు.
గుంటూరు జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫిర్యాదుతో పవన్ కళ్యాణ్‌పై 499, 500 ఐపీసీ సెక్షన్ల కింద జిల్లా కోర్టులో క్రిమినల్ కేసు దాఖలైన సంగతి తెలిసిందే. ఇది ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ అయ్యింది.. ఈ మేరకు పవన్ కళ్యాణ్‌కు నోటీసులు పంపారు. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించగా.. గతంలో పవన్ కళ్యాణ్‌పై ఫిర్యాదు చేసిన వాలంటీర్లను న్యాయమూర్తి ప్రశ్నించగా.. తమకు ఈ కేసుతో సంబంధం లేదని, ప్రభుత్వం దాఖలు చేసిన ఫిర్యాదులో తాము సంతకాలు కూడా చేయలేదని చెప్పారు. దీంతో ఈ క్రిమినల్ కేసును తొలగిస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు.
మరోవైపు తిరుపతి ప్రజలకు ప్రతి నెలా మొదటి మంగళవారం తిరుమల శ్రీవారి దర్శనం కల్పిస్తూ టీటీడీ పాలకమండలి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. టీటీడీ పాలకమండలి తొలి సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఛైర్మన్ బీఆర్ నాయుడు, బోర్డు సభ్యులకు, ఈవో శ్యామలరావుకు అభినందనలు తెలిపారు. ఎన్నికల ప్రచార సమయంలో తిరుపతి నగర ప్రజలు ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చారని.. ఈ నిర్ణయం తిరుపతి ప్రజలకు సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం హామీని నెరవేరుస్తుందని భరోసా ఇచ్చానని.. నగర ప్రజల ఆకాంక్షను టీటీడీ ఛైర్మన్, ఈవో దృష్టికి తీసుకువెళ్లి పరిశీలించాలని సూచించాను అన్నారు. తిరుమల పవిత్రతను పరిరక్షించేందుకు ఆలోచనలు చేస్తూ, ఆ దిశగా యంత్రాంగాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
Amaravati News Navyandhra First Digital News Portal