బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మహారాష్ట్రలోని పలు జిల్లాల్లోనూ గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. తెలంగాణలోని 14 రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి జిల్లాల్లో గురువారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్‌లోనూ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు.
అల్పపీడన ప్రభావంతో బుధవారం (సెప్టెంబర్ 25) హైదరాబాద్ నగరంతో పాటు ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.
ఉత్తర తెలంగాణలోని 14 జిల్లాల్లో బుధవారం రాత్రి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో బుధవారం రాత్రి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. అటు మహారాష్ట్రలో ముంబై, థానే, పూణే సహా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.