ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలు పలు చోట్ల తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు నగరాలను కుండపోత వానలు అతలాకుతలం చేస్తున్నాయి. గుంటూరు జిల్లా ఉప్పలపాడులో విషాదం చోటు చేసుకుంది. వరద ఉద్ధృతికి కారు వాగులో కొట్టుకుపోయి, స్కూల్ టీచర్ సహా ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మృతులను రాఘవేంద్ర, సాత్విక్, మానిక్‌గా గుర్తించారు. మంగళగిరి మండలం, ఉప్పలపాడుకు చెందిన నడుంపల్లి రాఘవేంద్ర (38).. నంబూరులోని వివా స్కూల్‌లో మ్యాథ్స్ టీచర్‌గా పనిచేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం తరగతులు ముగిసిన అనంతరం.. ఇంటికి బయల్దేరే సమయంలో భారీ వర్షం కురుస్తుండటంతో.. అదే పాఠశాలలో చదువుతున్న ఉప్పలపాడుకు చెందిన పసుపులేటి సౌదీస్ (6 ఏళ్లు), కోడూరి మాన్విత్ (9 ఏళ్లు) విద్యార్థులను తన కారులో ఎక్కించుకొని బయల్దేరారు. ఉప్పలవాడు సమీపంలో వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో.. వారు ప్రయాణిస్తున్న కారు వరదలో కొట్టుకుపోయి కాలువలోకి వెళ్లిపోయింది.
స్థానికులు గమనించి తాళ్ల సాయంతో కారును కాలువలో నుంచి బయటకి తీసుకొచ్చారు. కారులో నుంచి టీచర్, ఇద్దరు విద్యార్థుల మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనతో టీచర్ రాఘవేంద్ర, విద్యార్థుల ఇళ్లలో తీవ్ర విషాదం నెలకొంది.
Amaravati News Navyandhra First Digital News Portal