Property Prices Surge: రియల్ ఎస్టేట్‌కు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. కరోనా సమయంలో కాస్త ఈ రంగంపై ప్రభావం పడినా.. మళ్లీ కొన్నాళ్లకే ఊహించని రీతిలో పుంజుకుంది. ఇప్పుడు అడ్డూఅదుపు లేకుండా రియల్ ఎస్టేట్ రంగం దూసుకెళ్తోంది. ముఖ్యంగా ఇళ్లు, భూముల ధరలు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. రేట్లు పెరుగుతున్నా డిమాండ్ ఏ మాత్రం తగ్గట్లేదు. నిత్యం కొత్త కొత్త హౌసింగ్ ప్రాజెక్ట్స్ ప్రారంభం అవుతూనే ఉన్నాయి. వీటిల్లో బుకింగ్ ప్రాసెస్ కూడా గంటల్లో ముగుస్తోంది. అంతలా డిమాండ్ ఉంది మరి. గత 5 సంవత్సరాల్లో టాప్- 10 ప్రధాన నగరాల్లో కొత్త హౌసింగ్ ప్రాజెక్ట్‌లలో ఇళ్ల ధరలు సగటున 88 శాతం పెరిగాయట. ఈ మేరకు రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ ప్రాప్ ఈక్విటీ తెలిపింది. వీటిల్లో ఏ నగరంలో హౌసింగ్ ప్రైసెస్ ఎలా ఉన్నాయనేది చూద్దాం.
కొత్తగా లాంఛ్ అయిన హౌసింగ్ ప్రాజెక్టుల్లో గురుగ్రామ్‌లో ఐదేళ్ల వ్యవధిలో ఇళ్ల ధరలు ఏకంగా 160 శాతం పెరిగినట్లు ఈ రిపోర్ట్ తెలిపింది. 2019లో ఇక్కడ చదరపు అడుగు ధర రూ. 7500 గా ఉండగా.. అది ఇప్పుడు రూ. 19,500 కి చేరింది. ఇక నోయిడాలో ఇది 146 శాతం పెరుగుదల చూయిస్తుంది. 2019లో రూ. 6500 గా ఉన్న చదరపు అడుగు ధర ఇప్పుడు రూ. 16 వేలకు చేరింది. బెంగళూరులో రూ. 5051గా ఉండగా.. ఇప్పుడు చదరపు అడుగు ధర రూ. 10,020కి చేరింది. ఇక్కడ 98 శాతం వృద్ధి కనిపించింది. ఏడాది వ్యవధిలో చూస్తే 20 శాతం రేట్లు పెరిగాయి.