క్రెడిట్ స్కోరు తక్కువుందా.. లోన్ అస్సలు రావట్లేదా? ఈ అపోహలు వీడితేనే తక్కువ వడ్డీకి రుణాలు!

లోన్లపై వడ్డీ రేట్లు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఇదే సమయంలో మెరుగైన క్రెడిట్ స్కోరు ఉన్న వారికి మాత్రం వడ్డీలో రాయితీ ఇస్తామని బ్యాంకులు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మంచి స్కోరు సాధించే క్రమంలోనే క్రెడిట్ స్కోరుపై చాలా మందిలో ఎన్నో అపోహలు ఉంటాయి. వీటిని వీడాల్సిన అవసరం ఉంది. చాలా మంది కొత్తగా ఉద్యోగంలో చేరిన వెంటనే.. వారి వారి అవసరాల నిమిత్తం వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డుల్ని తీసుకుంటున్నారు. కార్డు తీసుకోగానే మురిసిపోవద్దు. దానిని సరిగ్గా నిర్వహించగలగాలి. సమయానికి బిల్లు చెల్లించగలగాలి. క్రెడిట్ స్కోరు ఇస్తామని ఎప్పటికప్పుడు ఫోన్లు వస్తుంటాయి. వీటిని అధిగమించగలగాలి. తొందరలో నిర్ణయాలు తీసుకోవద్దు.

ఎక్కువ ఆదాయం ఉంటేనే.. మంచి క్రెడిట్ స్కోరు ఉంటుందనే అపోహ చాలా మందిలో ఉంటుంది. క్రెడిట్ బ్యూరోలు చెప్పే వివరాల్లో బ్యాంక్ అకౌంట్ల పేర్లు ఉంటాయి. అంతే కానీ వాటిల్లో ఎంత మొత్తం నిల్వ ఉంది.. ఖాతాదారుకు వస్తున్న ఆదాయం ఎంత అనేది తెలిసుండదు. ఉదాహరణకు రూ. 4 లక్షల ఆదాయం ఉన్న వారికి క్రెడిట్ స్కోరు బాగుండొచ్చు. అదే 20 లక్షల ఆదాయం ఉంటే.. క్రెడిట్ స్కోరు పేలవంగా ఉండొచ్చు. అందుకే ఆదాయంతో సంబంధం లేకుండా.. టైంకు బిల్లులు కట్టడం, క్రెడిట్ వినియోగం పరిమితిలో ఉండటం వంటివి క్రెడిట్ స్కోరు విషయంలో కీలకంగా వ్యవహరిస్తుంటాయి.

ఇంకొందరు క్రెడిట్ కార్డు పరిమితిలో పెద్దగా వాడకపోయినా స్కోరుపై నెగెటివ్ ఎఫెక్ట్ చూయించిందనే సందేహం వ్యక్తం చేస్తుంటారు. అయితే వాస్తవం చెప్పాలంటే కార్డు లిమిట్‌లో 40 శాతానికి మించి వాడినప్పుడు.. కాస్త ప్రతికూల ప్రభావం ఉంటుంది. మీ కార్డు లిమిట్ రూ. లక్ష ఉంటే.. బిల్లింగ్ సైకిల్లో ఎప్పుడూ రూ. 40 వేలు మించొద్దు. కొందరు మినిమం డ్యూ చెల్లించి.. కార్డు కొనసాగిస్తుంటారు. క్రెడిట్ స్కోరు పెంచుకోవాలంటే ఇది అస్సలు మంచి పద్ధతి కాదు. పూర్తి బిల్లు ఒకేసారి చెల్లిస్తేనే ఇది సాధ్యం అవుతుంది.

ఇంకా పాత క్రెడిట్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లను రద్దు చేస్తే.. క్రెడిట్ స్కోరు పెరిగే అవకాశం ఉందన్న వాదనలో ఏ మాత్రం నిజం లేదు. దీంతో మీ రుణ చరిత్ర తగ్గుతుంది. ఇంకా క్రెడిట్ స్కోరు కూడా తగ్గే ప్రమాదం ఉంటుంది. సుదీర్ఘ క్రెడిట్ హిస్టరీ ఉన్నప్పుటే.. రుణదాతలకు మీ ఆర్థిక క్రమశిక్షణపై ఒక అవగాహన వస్తుంది. అందుకే.. చాలా కాలంగా వాడుతున్న అకౌంట్లను రద్దు చేయొద్దు.

ఇంకా కొత్త లోన్, క్రెడిట్ కార్డుకు అప్లై చేసిన ప్రతిసారీ మీ క్రెడిట్ స్కోరుపై ఎఫెక్ట్ పడుతుందన్న సంగతి మర్చిపోవద్దు. మంచి స్కోరు ఉంటేనే మీ లోన్ దరఖాస్తులకు ఆమోదం వస్తుంది. తక్కువ వ్యవధిలో 2-3 బ్యాంకుల దగ్గర లోన్ కోసం ప్రయత్నించినా స్కోరు తగ్గుతుంది. అందుకే రుణ దరఖాస్తులు తగ్గించుకోవాలి.

ఎక్కువగా చాలా మంది తమ క్రెడిట్ స్కోరు పెంచుకోలేం అని ఆందోళన చెందుతుంటారు. దీంట్లో వాస్తవం ఏ మాత్రం లేదు. క్రెడిట్ స్కోరు ఆర్థిక చరిత్రను ప్రతిబింబిస్తుంది. లోన్లు తీసుకొని టైంకు తీర్చడం వల్ల కాలక్రమేణా సిబిల్ స్కోరు పెంచుకోవచ్చు.

About amaravatinews

Check Also

వామ్మో హడలెత్తిస్తున్న మరో వైరస్.. GBS వ్యాధి ఎలా వస్తుంది? లక్షణాలు ఎలా ఉంటాయంటే..

గులియన్ బారే సిండ్రోమ్ ఇప్పుడు కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లో తొలి కేసు నమోదైంది. సిద్దిపేటకు చెందిన మహిళకు GBS పాజిటివ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *