జార్ఖండ్‌లో రైలు ప్రమాదం జరిగింది. చక్రధర్‌పూర్ దగ్గర హౌరా-సీఎస్‌ఎంటీ (ముంబై) ఎక్స్‌ప్రెస్ రైలు మూడు బోగీలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికుకలకు తీవ్ర గాయాలయ్యాయి.. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై రైల్వే అధికారులు స్పందించాల్సి ఉంది.
మరోవైపు బీహార్‌లో కూడా సోమవారం రైలు ప్రమాదం జరిగింది. సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ సమస్తిపూర్ దగ్గర ఇంజిన్, రెండు బోగీల నుంచి ఇతర బోగీలు విడిపోయాయి. సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు దర్బంగ నుంచి న్యూఢిల్లీకి వెళుతుండగా ఘటన జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలు కప్లింగ్ తెగిపోవడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అధికారుల అప్రమత్తంగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ఇంజిన్, కోచ్‌లను కలిపే కప్లింగ్ విరిగిపోవడంతో రైలు రెండు బాగాలుగా విడిపోగా.. వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలు ఇంజిన్‌ను నిలిపివేశాడు. దీంతో ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు వణికిపోయారు. వెంటనే రైల్వే ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని రైలు కోచ్‌ను కనెక్ట్ చేయగా.. వెంటనే రైలు ఢిల్లీకి బయల్దేరి వెళ్లిపోయింది.
పశ్చిమ బెంగాల్‌లో వందేభారత్ రైల్లో భోజనం అందించిన సిబ్బందిపై ఓ ప్రయాణికుడు దాడి చేసిన ఘటన కలకలంరేపింది. ఓ వృద్ధుడు హౌరా నుంచి రాంచీకి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించాడు.. భోజనం సమయంలో ఆయన థాలీని ఆర్డర్ చేశాడు. అయితే సిబ్బందిలో ఒకరు పొరబాటున మాంసాహారాన్ని తీసుకొచ్చి వడ్డించారు. ఆ ప్రయాణికుడు కాసేపటికి అది నాన్ వెజ్ అని గమనించి.. తనకు మాంసాహారాన్ని వడ్డించాడని వెయిటర్‌పై దాడికి చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రయాణికుడి తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఏదో పొరపాటు జరిగి ఉండొచ్చని.. చిన్న కారణానికే దాడి చేయడం సరికాదంటున్నారు. అయితే పొరపాటు జరిగింది.. సమస్యన పరిష్కరించామని రైల్వే అధికారులు తెలిపారు.