ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. . రాజధాని నిర్మాణం కోసం సీఆర్డీఏకు రూ. 11 వేల కోట్ల రుణం మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంత్రి నారాయణ ఢిల్లీలో హౌసింగ్, అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (హడ్కో) సీఎండీని కలిశారు. అమరావతి నిర్మాణంలో ప్రభుత్వ ఆలోచన విధానాన్ని వివరించగా.. రూ.11వేల కోట్ల ఈ రుణానికి సంబంధించి హడ్కో ఛైర్మన్, సీఎండీ (మేనేజింగ్ డైరెక్టర్) సంజయ్ కుల్ శ్రేష్ఠ హామీ ఇచ్చారని మంత్రి నారాయణ తెలిపారు.
మరో రూ. 165 కోట్ల రుణం విడుదలకూ హడ్కో సీఎండీ అంగీకరించారని మంత్రి నారాయణ తెలిపారు. ఈ నిధులు నెల్లూరు నగరపాలక సంస్థలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు వినియోగిస్తామన్నారు. ఏపీ రాజధాని అమరావతి మొదటి దశ నిర్మాణానికి రూ. 26 వేల కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. అమరావతికి ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంకు రూ. 15 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ఇప్పటికే అంగీకరించిన సంగతి తెలిసిందే. తాజాగా హడ్కో రూ. 11 వేల కోట్ల రుణం మంజూరుకు హామీ వచ్చింది.. మొత్తం కలిపి రూ. 26 వేల కోట్లు సమకూరింది.
అమరావతి నిర్మాణంలో ప్రభుత్వ భవనాల కాంప్లెక్, ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో మౌలిక వసతులు అభివృద్ధి, తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వంటి సదుపాయాలు, ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి మిగిలిన పనుల పూర్తికి రూ.50 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇందులో కూడా మొదటి విడత పనుల పూర్తికి రూ. 26 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా ఉంది. ఈ నిధుల సమీకరణ కోసం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ప్రపంచబ్యాంకు, ఆసియా డెవల్‌పమెంట్ బ్యాంకు కలిసి రూ.15 వేల కోట్లు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రక్రియ డిసెంబర్ కల్లా పూర్తవుతుందని చెబుతున్నారు అధికారులు.