కుండపోత వర్షం హైదరాబాద్‌ని షేక్ చేసింది. ఆదివారం రాత్రి ఫ్లాష్‌ఫ్లడ్స్.. వల్ల అనేక కాలనీలను ముంచెత్తాయి. ఆసిఫ్‌నగర్ మాంగర్‌బస్తీలో ఇద్దరు కొట్టుకుపోవడం… స్థానికంగా కలకలం రేపుతోంది. దాంతో, జిల్లా కలెక్టర్‌తోపాటు హైడ్రా కమిషనర్ రంగంలోకి దిగారు. మాంగర్‌బస్తీలో తిరుగుతూ అక్కడి పరిస్థితిని పరిశీలించారు. మరోసారి అలాంటి ప్రమాదం జరగకుండా ఏం చేయాలో యాక్షన్ ప్లాన్ సిద్ధంచేస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో నాలాల కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాంగర్‌బస్తీలోనే కాదు.. చాలాచోట్ల నాలాలు కబ్జాలో ఉన్నాయన్నారు. మాంగర్‌బస్తీలాంటి ఘటనలు జరగకూడదనే హైడ్రా పనిచేస్తోందని గుర్తుచేశారు. హైడ్రా విలువ ఇప్పుడు ప్రజలకు తెలిసి వస్తోందన్నారు.. అంతేకాదు.. ఏపీ, కర్నాటకలో కూడా హైడ్రా లాంటి వ్యవస్థ కావాలనే డిమాండ్ వస్తోందని రంగనాథ్ తెలిపారు.
మాంగర్‌బస్తీలో 145 ఇళ్లు నాలాపైనే ఉన్నాయని హైదరాబాద్ కలెక్టర్ హరిచందన పేర్కొన్నారు. మాంగర్‌బస్తీ వాసులు ముందుకొస్తే ఇందిరమ్మ ఇళ్లకు తరలిస్తామన్నారు. మాంగర్‌బస్తీ సమస్యకు వారంరోజుల్లో పరిష్కారం చూపిస్తామన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. నాలాకు అడ్డుగా ఉన్న నాలుగైదు ఇళ్లను తొలగిస్తామని చెప్పారు. అయితే, అన్ని ఇళ్లను తొలగిస్తామని ఎవరూ భయపడొద్దని రంగనాథ్ సూచించారు.