చెన్నై నగరాన్ని వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. తమిళనాడు రాజధానితో పాటు దాని పరిసర జిల్లాల్లో రెండు రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలో పలు ప్రాంతాల్లో 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. వరదలు పెద్ద ఎత్తున పోటెత్తడంతో నగరవాసులు నరకం అనుభవిస్తున్నారు. 300 ప్రాంతాలు నీట మునిగాయి. సబ్‌వేలల్లో 3 అడుగుల మేర నీరు చేరింది. కొంత మంది నడుము లోతు నీళ్లలో వెళ్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చెన్నై వరదలు తమిళనాడు వాళ్లకే కాకుండా, హైదరాబాద్ వాళ్లకు డిస్కషన్ పాయింట్ అయ్యింది. Hydraపై కొంత మంది పోస్టులు చేస్తున్నారు. చెన్నైలో మాదిరిగా హైదరాబాద్ వాసులు ఇబ్బంది పడకూడదంటే నాలాలు, మూసీ నది వెంట ఆక్రమణలు తొలగించాల్సిందేనని పోస్టులు పెడుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
భారీ వర్షాలు కురిసినప్పుడల్లా చెన్నై నగరంలో చాలా నష్టం వాటిల్లుతోంది. దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి ‘సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం’ అయితే, రెండో కారణం ‘ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు’. చెన్నై నగరం మీదుగా ఒకప్పుడు మూడు నదులు ప్రవహించేవి. అవి.. కూవం, అడయార్, కొసస్తలయార్ నదులు. కాలక్రమేనా ఈ 3 నదులు కాలుష్య కాసారంగా మారాయి. నాలాలు ఆక్రమణలకు గురై వరద నీరు వెళ్లిపోయేందుకు మార్గం కుంచించుకుపోయింది. కూవం నది అయితే పూర్తిగా డ్రైనేజీలా మారిపోయింది.
Amaravati News Navyandhra First Digital News Portal