తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలన్న మెగాస్టార్ చిరంజీవి
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కరుస్తున్నాయని.. వరదల ప్రభావం ఎక్కువగా ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెగాస్టార్ చిరంజీవి కోరారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సోషల్ మీడియా వేదికగా సూచించారు. ‘ తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. పలు గ్రామాలు, జాతీయ రహదారులు నీటితో మునిగిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మీ కుటుంబ సభ్యుడిగా నా మనవి ఒక్కటే.. అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటకు రావద్దు. వైరల్ ఫీవర్ వంటివి వచ్చే ప్రమాదం ఉంది. ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు, బాధితులకు మా అభిమానులు ఎల్లప్పుడూ అండగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడూ ఉంటారని ఆశిస్తున్నాను’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.
ఎమర్జెన్సీ సేవల కోసం కంట్రోల్ రూమ్
ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ముఖ్యంగా గర్భిణులు, పాము కాటు, విద్యుత్ షాక్‌లకు గురైన వారికి సత్వరమే సేవలు అందించేందుకు కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఎమర్జెన్సీ సేవల కోసం 9032384168, 7386451239, 8374893549 నంబర్లకు ఫోన్ చేయాలని ప్రభుత్వం ప్రజలకు సూచించింది. సెప్టెంబర్ 3 వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పింది.