ప్రతి సామాన్యుడికి సొంతిళ్లు అనేది ఓ కల. తాము ఉద్యోగం చేసే ఊర్లో ఓ సొంతిళ్లు ఉండాలని ప్రతిఒక్కరు కలలు కంటుంటారు. చాలా మంది అప్పులు చేసైనా, లోన్లు తీసుకునైనా సరే.. సొంతింటి కలను నెరవేర్చుకుంటుంటారు. గతంలో అయితే స్థలం కొనుక్కుని.. అందులో మనకు కావాల్సినట్టుగా కలల సౌధాన్ని నిర్మించుకునేవారు. కానీ ఇప్పుడు బిల్డర్లే కట్టి రెడీమేడ్‌గా.. కూరగాయలు అమ్మినట్టుగా అమ్మేస్తున్నారు. ఇండిపెండెంట్ ఇండ్లు, అపార్టమెంట్లలో ఫ్లాట్లు ఇలా ఏది కావాలన్నా దొరుకుతుంది కానీ.. వాటి ధరలు చూస్తే దిమ్మతిరిగి బొమ్మ కనపడాల్సిందే. అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్లు మాత్రమే కొనుగోలు చేసేలా ధరలు పెట్టటంతో.. మధ్యతరగతివాళ్లు, పేదలు.. పైసా పైసా కూడబెట్టి చిన్న స్థలం కొనుక్కుని.. వీలైనప్పుడు అందులో తమకు కావాల్సినట్టుగా ఇల్లు కట్టుకోవాలని చూస్తుంటారు.
అయితే.. ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్న సామెత ఊరికే రాలేదు. ఒక ఇల్లు కట్టాలంటే దానికి ఎన్నో రకాల ఇబ్బందులు ఉండాలో అన్నీ ఉంటుంటాయి. ఇంటికి ముహూర్తం చేసినప్పటి నుంచి గృహప్రవేశం చేసే వరకు అన్ని రకాల అనుభవాలు ఎదురవుతుంటాయి. మొట్టమొదటగా.. బిల్డింగ్ పర్మిషన్ రావాలంటే పెద్ద ప్రహాసనమే జరుగుతుంది. రకరకాల డిపార్ట్‌మెంట్ల నుంచి పర్మిషన్లు కావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆఫీసుల చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సి ఉంటుంది. అక్కడే సగం ఆయాసం వస్తుంటుంది. అయితే.. హైదరాబాద్ నగరంలో ఇల్లు కట్టుకునేవారికి అలాంటి ఇబ్బందులేవీ లేకుండా జలమండలి కీలక నిర్ణయం తీసుకుంది.
బిల్డింగ్ పర్మిషన్ కోసం కావాల్సిన వాటర్ ఫీజిబిలిటీ పత్రాన్ని ఇక నుంచి డైరెక్ట్‌గా ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయం నుంచి జారీ చేయనున్నట్లు ఎంబీ అశోక రెడ్డి ప్రకటించారు. మొన్నటి వరకు సీజీఎం కార్యాలయం నుంచి వాటర్ ఫీజిబిలిటీ పత్రాన్ని జారీ చేసేవారు. అయితే.. జారీ చేయటం వివిధ కారణాలతో ఆలస్యమవుతుండటంతో.. ఇంటి నిర్మాణం కూడా లేట్ అయ్యేది. హైదరాబాద్ నగరవాసులకు అలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకే.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎంబీ అశోక్ రెడ్డి తెలిపారు.