అనంతపురం జాయింట్ కలెక్టర్‌గా ఐఏఎస్ అధికారి డి. హరితకు ఇచ్చిన పోస్టింగ్‌ను ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. డి. హరితను అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆమె ఇంకా జేసీగా రిపోర్టు చేయలేదు. అయితే ఈ లోపే ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. పోస్టింగ్ రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం.. హరితను సాధారణ పరిపాలనశాఖలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు.
మరోవైపు ఐఏఎస్ ఆఫీసర్ హరిత గురించి టీడీపీ సీనియర్ లీడర్, అధికార ప్రతినిధి అయిన ఆనం వెంకటరమణ రెడ్డి చేసిన ఆరోపణలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐఏఎస్ ఆఫీసర్ హరిత గతంలో నెల్లూరు కమిషనర్‌గా పనిచేశారు. తిరుపతి కార్పొరేషన్‌లోనూ విధులు నిర్వహించారు. అయితే ఐఏఎస్ ఆఫీసర్ హరిత.. అవినీతి అధికారి అంటూ ఆనం సంచలన ఆరోపణలు చేశారు. అత్యంత అవినీతి ఐఏఎస్ అధికారుల్లో హరిత ఒకరంటూ ఇటీవల ట్వీట్ చేశారు. అలాగే తిరుపతి కార్పొరేషన్‍లో జరిగిన టీడీఆర్ బాండ్ల కుంభకోణంలోనూ హరిత పాత్ర ఉందంటూ ఆయన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో అనంతపురం జేసీగా హరితను నియమిస్తూ జారీ చేసిన పోస్టింగ్ ఉత్తర్వులను ప్రభుత్వం వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు తిరుపతిలో టీడీఆర్ బాండ్ల కుంభకోణం గురించి ఈ ఏడాది ఆరంభం నుంచి ఆనం వెంకటరమణా రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ జారీ చేసిన ట్రాన్సఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ (టీడీఆర్) బాండ్లలో అవినీతి జరిగిందంటున్నారు. తిరుపతిలో 18చోట్ల రోడ్ల నిర్మాణానికి మున్సిపల్ కార్పొరేషన్ మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది. రోడ్ల నిర్మాణానికి స్థలాన్ని సేకరించాలని నిర్ణయించిన అధికారులు.. పరిహారంగా టీడీఆర్ బాండ్లను పంపిణిచేశారు.
మొత్తం 373 టీడీఆర్ బాండ్లను జారీచేసిన అధికారులు.. ఎకరా రూ.60 కోట్ల చొప్పున స్థలాన్ని సేకరించారు. అయితే తిరుపతి శివార్లలోని వ్యవసాయభూమిని , నివాస ప్రాంతాలను వాణిజ్య స్థలాలుగా చూపి ఇలా సేకరించారని ఆనం ఆరోపిస్తున్నారు. అలాగే స్థలం యజమానికి కాకుండా వేరే వ్యక్తుల పేరిట టీడీఆర్ బాండ్లను జారీ చేశారని ఆరోపిస్తున్నారు. టీడీఆర్ బాండ్ల జారీలో ఐఏఎస్ అధికారి హరిత పాత్ర కూడా ఉందని ఆనం ఆరోపణ.