బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా బలపడింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా.. స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఐఎండీ అధికారులు హైదరాబాద్‌కు భారీ వర్షం హెచ్చరికలు జారీ చేశారు. నగరంలో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు.
హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు వాతావారణ కేంద్రం అధికారులు పింక్ అలర్ట్ ప్రకటించారు. మరో 48 గంటల పాటు వర్షం దంచికొట్టే అవకాశం ఉందని, వరదలు ముంచెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పాత ఇళ్లల్లో నివసించేవారు ముందస్తుగా ఖాళీ చేయాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు వచ్చే ప్రమాదం ఉన్నందున సెల్లార్లలో నివాసం ఉండేవారు కూడా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
కాగా, హైదరాబాద్ వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచే వర్షం కురుస్తోంది. ప్రస్తుతం నగర వ్యాప్తంగా చిరుజల్లులు పడుతున్నాయి. రాజధాని రోడ్లన్నీ తడిసి ముద్దయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో రెండ్రోజులు భారీ వర్షాలు ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తడి రోడ్ల మీద వాహనాలను నెమ్మదిగా నడపాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఎదైనా అత్యవసరమైతే 040-21111111, 9000113667 నంబర్లను సంప్రదించాలని జీహెచ్ఎంసీ అధికారులు సైతం నగర ప్రజలకు సూచించారు.
నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట్, యాదాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ మేరకు ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కొత్తగూడెం, భూపాలపల్లి, గద్వాల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, మేడ్చల్, ములుగు, నారాయణపేట్, పెద్దపల్లి, సంగారెడ్డి, సిద్దిపేట,, వనపర్తి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలతో రాష్ట్రంలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి.