ఆంధ్రప్రదేశ్‌కు మరో ముప్పు ముంచుకొస్తోంది.. ఉత్తరాంధ్రను, పశ్చిమ బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతం అనుకొని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఇవాళ పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. అలాగే రాజస్థాన్‌లోని జైసల్మేర్, రామగుండం, కళింగపట్నం మీదుగా బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో నేటి నుంచి ఈ నెల 9వ వరకూ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడనం ఉత్తర వాయవ్యంగా పయనిస్తుందని అంచనా వేస్తున్నారు.. ఇది వాయుగుండంగా మారే అవకాశం కూడా ఉందంటున్నారు. దీనిపై ఓ క్లారిటీ రావాల్సి ఉంది.
ఒకవేళ అల్పపీడనం ఏర్పడితే రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం పల్నాడు, ఏలూరు, ఎన్‌టిఆర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. అల్లూరి సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందంటోంది విపత్తుల నిర్వహణ సంస్థ. అలాగే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అలాగే తీరం వెంబడి 30 కి.మీ. నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. ఆదివారం వరకూ మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు.
బుధవారం అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, కర్నూలు, కడపతో పాటూ పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిశాయి. బుధవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. రాజమహేంద్రవరంలో లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు జలదిగ్బంధంలో ఉన్నాయి. ఎగువ ప్రాంతాల్లో వర్షాల ప్రభావంతో గోదావరికి వరద ప్రభావం పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి బుధవారం సాయంత్రం 6 గంటలకు 9.5 అడుగుల నీటిమట్టంతో 6.86 లక్షల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదుకాగా.. గురువారం నాటికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారని చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో గత శుక్రవారం నుంచి ఆదివారం వరకు కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలం అయ్యింది. బుడమేరు, మున్నెరు వరదతో ఓ విధంగా జల ప్రళయం కనిపించింది. విజయవాడ సహా పరిసర ప్రాంతాలన్నీ నీట మునిగిపోగా.. ఇళ్లన్నీ వరద నీటిలో మునిగిపోవడంతో ప్రజలు నిరాశ్రయులయ్యారు. రెండు, మూడు రోజులుగా వరద ఉధృతి తగ్గడం, వాన లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇంతలోనే వాతావరణ శాఖ హై అలర్టక ప్రకటించడంతో ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఇక గడిచిన 24 గంటలలో రాష్ట్రంలోని కైకలూరులో 6 సెంటిమిటర్ల వర్షపాతం నమోదైంది.