ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల కురుస్తాయని అంచనా వేస్తోంది వాతావరణశాఖ. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.. ఈ ప్రభావంతో రాబోయే రెండు, మూడు రోజుల్లో.. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయంటున్నారు. ఈ నెలలో మూడు తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో రెండు, అరేబియాలో మరో తుఫాన్ ఏర్పడుతుందని.. ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఉంటుందని భావిస్తున్నారు. ఈ నెల 10 తర్వాత కోస్తాంధ్ర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇవాళ పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
మరోవైపు ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. అనకాపల్లి, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, నంద్యాల, కర్నూలు తదితర జిల్లాల్లో వానలు కురిశాయి. ఆదివారం రాత్రి 7 గంటల వరకు అత్యధికంగా రాజమహేంద్రవరంలో 53 మిల్లీ మీటీర్ల వర్షపాతం నమోదైంది. మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడ్డాయి. ఓ వైపు పలు జిల్లాల్లో వర్షాలు పడితే.. మరికొన్ని జిల్లాల్లో విచిత్రంగా ఎండ దెబ్బకు వేడి వాతావరణం ఉంది. నెల్లూరు జిల్లా కావలిలో ఆదివారం గరిష్ఠ ఉష్ణోగ్రత 37.6 డిగ్రీలు నమోదైంది. అలాగే విశాఖపట్నం, తుని, కాకినాడ, నరసాపురం, మచిలీపట్నం, నందిగామ, కావలి, తిరుపతి, కడప, అనంతపురం వంటి ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు పెరిగాయని చెబుతున్నారు. మొత్తానికి రాష్ట్రంలో కాస్త విచిత్రమైన వాతావరణం ఉంది.. కొన్ని జిల్లాల్లో వర్షాలు పడుతుంటే, మరికొన్ని జిల్లాల్లో మాత్రం ఎండల తీవ్రత ఉంది.