తెలుగు రాష్ట్రాల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బీభత్సం సృష్టించింది. ఈ వాయుగుండం శనివారం అర్ధరాత్రి దాటాక శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలో 10 కిలోమీటర్ల వేగంతో తీరం దాటిన సంగతి తెలిసిందే. ఈ వాయుగుండం భూభాగంలోకి వచ్చాక వేగం 20 కిలోమీటర్లకు పెరిగింది. ప్రసుత్తం దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో కొనసాగుతోంది. ఈ వాయుగుండం రాబోయే 24 గంటల్లో ఇది దక్షిణ ఛత్తీస్‌గఢ్, విదర్భ (మహారాష్ట్ర) వైపు కదులుతూ తీవ్ర అల్పపీడనంగా బలహీనపడుతుందని అంచనా వేస్తున్నారు.
అయితే రుతుపవన ద్రోణి వాయుగుండం కేంద్రం మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతోందని వాతావరణశాఖ తెలిపింది. ఈ ప్రభావంతో రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. సోమవారం కూడా మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు అధికారులు. అంతేకాదు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. అక్కడక్కడా కొన్ని జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందంటున్నారు. కళింగపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు జారీ చేసిన మూడో నంబరు హెచ్చరికలు వెనక్కు తీసుకున్నారు.
ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, అన్నమయ్య, చిత్తూరు , తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు ప్రకాశం బ్యారేజి ప్రస్తుత ఇన్ & ఔట్ ఫ్లో 10,25,776 క్యూసెక్కులు కాగా.. రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వరద ప్రవాహం 11 లక్షల క్యూసెక్కులు వరకు చేరే అవకాశం ఉంది. లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
విజయవాడను అతి భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. అతి భారీ వర్షాలతో పాటుగా బుడమేరు పొంగడంతో నగరవాసులు వణికిపోయారు. శనివారం అర్ధరాత్రి నుంచి బుడమేరుకు నీటి ప్రవాహం పెరిగి వరద పోటెత్తింది. ఆదివారం తెల్లవారేసరికి విజయవాడ పశ్చిమ, మధ్య నియోజకవర్గాల్లోని చాలా ప్రాంతాలు వరదలో చిక్కుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగి ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌కు వచ్చి అక్కడే మకాం మార్చారు. బాధితులకు అవసరమైన ఆహారాన్ని అందజేయాలని సూచనలు చేశారు. విజయవాడలో పరిస్థితులన్నీచక్కబడే వరకు ఇక్కడే ఉంటానన్నారు.. దుర్గగుడి ద్వారా ఆహారం తయారు చేయించాలని చంద్రబాబు ఆదేశించారు. దుర్గగుడి అధికారులను పిలిపించి మాట్లాడారు.. ఉదయంలోగా 50 వేల మందికి పులిహోర సిద్ధం చేయాలని సూచించారు. విజయవాడ ప్రైవేట్ హోటల్స్ యాజమానులతో మాట్లాడి.. ఉదయంలోగా లక్షమందికి ఆహారం సిద్ధం చేయాలన్నారు. . వరద బాధితులకు ఆహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.