రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా వైపుగా కదులుతున్న వాయుగుండం తీవ్రంగా బలపడింది. కళింగపట్నానికి దక్షిణంగా 30కి.మీ, విశాఖకు ఈశాన్యంగా 90 కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండ్రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, మహబూబ్‌నగర్, నారాయణపేట, వికారాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
భారీ వర్షాలతో తెలంగాణలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, ప్రాజెక్టులు, జలాశయాలు నిండుకుండలా మారాయి. ఈనెల 3 వరకు వర్షం హెచ్చరికలు ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను ప్రభుత్వం ఆదేశించింది. భారీ వర్షాలపై సీఎం రేవంత్ కూడా ఆరా తీశారు. వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మున్సిపల్, విద్యుత్, వైద్యారోగ్య, రెవెన్యూ శాఖలు మరింత చురుకుగా వ్యవహరించాలన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త వహించాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించాలన్నారు. రిజర్వాయర్ల గేట్లు ఎత్తే ముందు దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పారు.