India US Relations: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే ఆయన అగ్రరాజ్య అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో ప్రపంచ దేశాలు.. అమెరికా కొత్త అధ్యక్షుడి హయాంలో ఆ దేశంతో సంబంధాలు ఎలా ఉంటాయి అనేది లెక్కలు వేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే.. ట్రంప్ 2.0 హయాంలో భారత్-అమెరికా సంబంధాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ప్రస్తుతం తీవ్ర ఆసక్తికరంగా మారింది. వాణిజ్యం, దౌత్యపరమైన సంబంధాలు, వలసలు, సైనిక సహకారం వంటి అంశాల్లో భారత్-అమెరికా మధ్య ఎలాంటి సంబంధాలు కొనసాగుతాయి అనేది కీలకంగా మారింది. ఈ నేపథ్యంలోనే వీటి విషయాల్లో భారత్ పట్ల డొనాల్డ్ ట్రంప్ వైఖరి ఏ విధంగా ఉంటుంది అనేది ఆసక్తి రేపుతోంది.
అమెరికాలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్న వేళ.. ముఖ్యంగా అమెరికా విదేశాంగ విధానాన్ని పునరుద్ధరించడంపై దృష్టి పెట్టినట్లు కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. తొలిసారి ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. అమెరికా దేశ ప్రయోజనాలకు ఆయన అధిక ప్రాధాన్యం ఇచ్చారు. పారిస్ వాతావరణ ఒప్పందాలు, ఇరాన్ అణు ఒప్పందంతో సహా కీలక అంతర్జాతీయ ఒప్పందాల్లో కొన్నింటి నుంచి అమెరికా బయటికి రావడం లేదా మరికొన్నింటిని పరిష్కరించడం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మరోసారి ట్రంప్ అధికారంలోకి వస్తున్న నేపథ్యంలో భారత్ సహా ప్రపంచ దేశాలతో ఇప్పటివరకు అమెరికా చేసుకున్న ఒప్పందాలపై ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. వీటిలో మరీ ముఖ్యంగా దౌత్యం, వాణిజ్యం, వలసలు, సైనిక సహకారం వంటి వాటిలో పెను మార్పులు వస్తాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.