బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత జట్టు కుప్పకూలింది. పేకమేడను తలపిస్తూ.. భారత బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఏకంగా ఐదుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. మొత్తంగా కేవలం ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. దీంతో భారత్.. కేవలం 31.2 ఓవర్లలోనే 46 పరుగులకు కుప్పకూలింది. భారత జట్టుకు సొంత గడ్డ మీద టెస్టుల్లో ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. ఓవరాల్‌గా టీమిండియాకు టెస్టుల్లో ఇది మూడో అత్యల్ప స్కోరు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. వర్షం కారణంగా తొలి రోజు ఆట పూర్తిగా రద్దు అయిన పరిస్థితుల్లో రోహిత్ తన నిర్ణయంతో ఆశ్చర్యపరిచాడు. అయితే భారత్ ఏదో కొత్త ప్లాన్‌తో వచ్చిందని అంతా భావించారు. కానీ మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే సీన్ రివర్స్ అయింది. బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుల్లో టీ20 తరహాలో బ్యాటింగ్ చేసి.. పరుగుల వరద పారించిన బ్యాటర్లు కివీస్ బౌలర్ల ధాటికి నిలవలేకపోయారు. వచ్చిన వారు వచ్చినట్లే పెవిలియన్‌కు చేరారు. దీంతో ఓ దశలో భారత్ 10 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.
కానీ క్రీజులో జైశ్వాల్ (13), రిషభ్ పంత్ (20) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. దీంతో భారత్ 31/3తో నిలిచి కోలుకున్నట్లే కనిపించింది. ఇంకా కేఎల్ రాహుల్, జడేజా, అశ్విన్ కూడా బ్యాటింగ్‌కు రావాల్సి ఉండటంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు చేస్తుందని అంతా భావించారు. కానీ జైశ్వాల్ ఔట్ కావడంతో కథ మొత్తం మారిపోయింది.
కేవలం 15 పరుగుల వ్యవధిలోనే భారత్ చివరి ఏడు వికెట్లు కోల్పోయింది. కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, రాహుల్, జడేజా, అశ్విన్‌లు డకౌట్ అయ్యారు. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 5 వికెట్లు తీసుకోగా, రౌర్కీ 4 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. టిమ్ సౌథీ ఓ వికెట్ పడగొట్టాడు.
భారత్ వికెట్లు పతనమైన తీరు 2020 డిసెంబర్లో ఆస్ట్రేలియా గడ్డ మీద 36 పరుగులకు ఆలౌట్ కావడాన్ని గుర్తుకు తెచ్చింది. అయితే సొంత గడ్డ మీద ఇంత స్కోరుకు టీమిండియా ఆలౌట్ కావడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతంగా పోరాడితే గానీ.. భారత్ ఈ మ్యాచ్ గెలవడం కష్టమే. ఒకవేళ ఈ మ్యాచ్‌లో గనుక న్యూజిలాండ్ గెలిస్తే.. భారత గడ్డ మీద ఆ జట్టుకు 1988 తర్వాత ఇదే తొలి టెస్టు విజయం అవుతుంది.