హసీనాకు రక్షణగా రఫేల్ జెట్లు పంపి.. విమానానికి భద్రత కల్పించిన భారత్‌

రిజర్వేషన్ల కోటాపై గత నెల రోజులుగా బంగ్లాదేశ్‌లో జరుగుతోన్న పరిణామాలను నిశితంగా గమనించి భారత్‌.. సోమవారం తీవ్రరూపం దాల్చి ప్రధాని షేక్‌ హసీనా (sheikh Hasina ) పదవి నుంచి తప్పుకోవడంతో మరింత అప్రమత్తమైంది. సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు సైన్యం 45 నిమిషాలే సమయం ఇవ్వడంతో ఆమె భారత్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న భారత భద్రతా దళాలు గగనతలంపై నిఘా పెంచాయి. బంగ్లాదేశ్ నుంచి వచ్చే విమానం భారత్‌లోకి సురక్షితంగా ప్రవేశించేలా చూడాలని నిర్ణయించాయి.

ఇందులో భాగంగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ రాడార్లు బంగ్లాదేశ్‌ (Bangladesh) గగనతలాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో అటు నుంచి ఓ విమానం వస్తున్న విషయం గుర్తించాయి. అందులో ఎవరు వస్తున్నారో ముందే తెలుసుకున్న అధికారులు భారత్‌లోకి అనుమతించాలని ఆదేశించారు. ఈ క్రమంలో హసీనా విమానానికి రక్షణగా పశ్చిమ్ బెంగాల్‌లోని హాసీమారా వైమానిక స్థావరం నుంచి 101 స్వ్కాడ్రన్‌లోని రఫేల్‌ యుద్ధ విమానాలను (Rafale Fighter Jets) పంపారు. బిహార్‌, ఝార్ఖండ్‌ మీదుగా ఆమె ప్రయాణిస్తున్న విమానం ఢిల్లీ సమీపంలోని హిండన్ ఎయిర్‌బేస్‌కు చేరుకునే వరకూ అవి రక్షణ కల్పించాయి.

అక్కడకు హసీనా విమానం చేరుకునే వరకూ భద్రతా దళాలు నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉన్నాయి. అందులోని సిబ్బందితో ఐఏఎఫ్‌కు ఉన్నతాధికారులే స్వయంగా సంప్రదింపులు జరిపారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ పరిణామాలన్నింటినీ వాయుసేనాధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌధరి, ఆర్మీ చీఫ్ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది నిశితంగా పరిశీలించినట్లు తెలుస్తోంది.

మరోవైపు, ఉన్నతాధికారులతో పాటు ఇంటెలిజెన్స్ సంస్థల చీఫ్‌లు, ద్వివేది, ఇంటిగ్రేటెడ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ జాన్సన్‌ ఫిలిప్‌ మాథ్యూ కలిసి అత్యున్నత సమావేశం నిర్వహించారు.

హిండన్‌ ఎయిర్‌ బేస్‌లోకి సాయంత్రం 5:45 గంటలకు హసీనా (Sheikh Hasina) విమానం చేరుకోగా.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్ ఆమెను ఆహ్వానించారు. అక్కడే దాదాపు గంటసేపు ఇరువురూ చర్చలు జరిపారు. బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులు సహా భవిష్యత్‌ కార్యాచరణ గురించి అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. అనంతరం అక్కడ నుంచి బయలుదేరిన దోవల్.. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన భద్రతా వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీకి పరిస్థితిని ఆయన వివరించారు.

ఇక, బంగ్లాదేశ్‌లో పరిస్థితిపై కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశాన్ని కేంద్రం ఏర్పాటుచేసింది. పొరుగు దేశంలో పరిణామాల గురించి.. ఈ సందర్భంగా ఆయన అన్ని పార్టీల నాయకులకు వివరించారు.

About amaravatinews

Check Also

75వ పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రధాని మోదీకి, దేశవిదేశాల నుంచి శుభాకాంక్షల వెల్లువ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ జన్మదిన వేడుకలను దేశవ్యాప్తంగా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. దేశవిదేశాలకు చెందిన ప్రతి ఒక్కరూ ప్రధాని మోదీకి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *